Maharashtra Govt Formation: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్, బెడిసి కొట్టిన భేటీ, శివసేనకు ఘలక్ ఇచ్చిన ఎన్‌సిపి, ప్రతిపక్షంలో కూర్చుంటామని శరద్ పవార్ ప్రకటన, బీజేపీకి మార్గం సుగమం
Maharashtra Govt Formation Updates | (Photo Credits: IANS)

Mumbai, November 6: మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు వెలువడి ఇప్పటికే రెండు వారాలు గడుస్తున్నా, ప్రభుత్వ ఏర్పాటు ( Government Formation)పై ప్రతిష్టంభన ఇంకా అలాగే కొనసాగుతుంది. నవంబర్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేస్తాను, మరో ఐదేళ్లు నేనే సీఎం అంటూ ధీమా వ్యక్తం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మిత్రపక్షం శివసేన (Shiv Sena) తిరుగుబాటుతో డీలా పడిపోయారు. అయితే మొత్తానికి ఆయనకు ఊరట కలిగించే విషయాన్ని అధినేత శరద్ పవార్ ఈరోజు ప్రకటించారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా, శివసేన మద్ధతు తప్పనిసరి అయింది. దీంతో తమకు ముఖ్యమంత్రి పీఠంలో రెండున్నరేళ్ల వాటా ఇస్తేనే మద్ధతిస్తామని బీజేపీ (BJP)కి తెగేసి చెప్పింది. ఇటు బీజేపీ కూడా ఎక్కడా రాజీపడలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఇరు పక్షాలు ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషించాయి. బుధవారం వివిధ పార్టీల మధ్య వరుస భేటీలు జరగడంతో మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి.

శివసేన తమ మిత్రపక్షం బీజేపీని వదిలేసి, వ్యతిరేక పక్షం అయిన కాంగ్రెస్- ఎన్‌సిపి కూటమితో జతకట్టి నేరుగా శివసేన ప్రభుత్వమే ఏర్పాటు చేసి బీజేపీకి షాక్ ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలో ఎన్‌సిపి (NCP) అధినేత శరద్ పవార్ తో శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రాత్ వరుస భేటీలు నిర్వహిస్తూ వచ్చారు. బుధవారం కూడా ఆయన శరద్ పవార్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ ఎక్కడో బెడిసి కొట్టిందో తెలీదు గానీ, ఈ భేటీ అనంతరం కొద్దిసేపటికి శరద్ పవార్ (Sharad Pawar ) మీడియాతో మాట్లాడుతూ తాము శివసేనతో చేతులు కలిపేది లేదని తేల్చిచెప్పారు. శివసేనకు  ఎన్‌సిపి మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేసిన ఆయన,  బీజేపీ మరియు శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.  తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని శరద్ పవార్ ప్రకటించారు.

దీంతో తమదైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలకున్న శివసేన ఆశలకు ఎన్‌సిపి గండికొట్టినట్లయింది. ఈ వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ - అమిత్ షా నేరుగా చక్రం తిప్పినట్లు తెలుస్తుంది.

288 మంది సభ్యులుండే మహారాష్ట్ర అసెంబ్లీలో, మెజారిటీ నిరూపించుకోవడానికి ఒక పార్టీ లేదా కూటమికి 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 105 సీట్లు సాధించింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 40మంది సభ్యుల అవసరం ఏర్పడింది. 56 సీట్లు సాధించిన మిత్రపక్షం శివసేన, ఫలితాల అనంతరం బీజేపికి హ్యాండ్ ఇవ్వడంతో ఈ ప్రతిష్ఠంభన ఏర్పడింది. కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) 54 స్థానాలను కైవసం చేసుకుంది.  13 మంది స్వతంత్రులు కూడా ఎన్నికయ్యారు.

తాజాగా, 54 సీట్ల సంఖ్యా బలం ఉన్న ఎన్‌సిపి పార్టీ, శివసేనకు మద్ధతిచ్చేది లేదని తేల్చేయడంతో ఇక శివసేనకు తిరిగి బీజేపీనే ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. ఒకవేళ ఇప్పటికీ శివసేన మొండిపట్టు పట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించకపోతే, ఇక నేరుగా గవర్నర్ రంగంలోకి రాష్ట్రపతి పాలన విధిస్తారు, ఆ తర్వాత ఆరు నెలల్లో మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.  అయితే శివ సేన మళ్ళీ అంత రిస్క్ చేసే అవకాశం లేదు. ఎలాగో అలా సర్దుకొని బీజీపికే మద్ధతు ఇవ్వక-తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో బీజేపీ-శివ్ సేన ప్రభుత్వం ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా అనూహ్య పరిణామాలు జరుగుతాయా అనేది చూడాలి.