CM KCR in Maharashtra: తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగడం లేదు, జల విధానాన్ని బంగాళాఖాతంలో కలపండి, సర్కోలిలో సీఎం కేసీఆర్ పూర్తి స్పీచ్ ఇదిగో..
రెండు రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. సర్కోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముందుగా సర్కోలీ సభకు విచ్చేసిన తనకు అపూర్వ స్వాగతం పలికిన భగీరథ్ బాల్కేకు ధన్యవాదాలు తెలియజేశారు.
Solapur, June 27: రెండు రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. సర్కోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముందుగా సర్కోలీ సభకు విచ్చేసిన తనకు అపూర్వ స్వాగతం పలికిన భగీరథ్ బాల్కేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని, దేశం బాగు కోసం ప్రస్తుతం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అన్ని వనరులూ ఉన్న మహారాష్ట్ర ఇంకెంతో అభివృద్ధి చెందాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయి. అభివృద్ధి విషయంలో ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. దేశాన్ని దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. మహారాష్ట్రలో ప్రజలు కాంగ్రెస్, శివసేన, బీజేపీకు అవకాశం ఇచ్చారు.
తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు? రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధి సాధించింది. మా విషయంలో అన్ని పార్టీలూ ఆందోళన చెందుతున్నాయి. బీజేపీకు బీఆర్ఎస్ బీ టీమ్ అని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన మాత్రమే నిలుస్తుంది. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నాం. దేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరముంది ’’ అని కేసీఆర్ అన్నారు.తాము ఏ పార్టీకి A టీమ్, B టీమ్ కాదని, తమది రైతుల టీమ్.. ప్రజల టీమ్ అని కేసీఆర్ నొక్కి చెప్పారు.
అసలు భారత దేశం లక్ష్యం ఏమిటని, దేశం ఒక లక్ష్యం లేకుండానే ముందుకు పోతోందా..? అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని సమస్యలకు పరివర్తన్ భారతే సరైన సమాధానమని అన్నారు. ఆ సమాధానం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇన్ని వనరులున్న దేశంలో విద్యుత్ సమస్య ఎందుకు వచ్చిందని..? కేసీఆర్ ప్రశ్నించారు. థర్మల్ విద్యుత్ తయారీకి పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు.
దేశంలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు విద్యుత్ అందించే సామర్థ్యం మనకు ఉందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర సర్కార్ల చేతగాని తనమే దేశంలో విద్యుత్ సమస్యలకు కారణమని మండిపడ్డారు. ఇకనైనా భారతదేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి సాధించాయని చెప్పారు. పొరుగు దేశం చైనా ఎక్కడుంది.. మనమెక్కడ ఉన్నామంటూ పోలిక లేవనెత్తారు. తెలంగాణలో తాము ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా ఉంటే మహారాష్ట్రలో ప్రతి ఎకారకు సాగునీరు అందించవచ్చన్నారు. ఆ ప్రభుత్వాలు అనుకుంటే పుష్కలంగా తాగునీరు అందించవచ్చని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం అనుసరిస్తున్న జల విధానాన్ని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశానికి నూతన జలవిధానం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ దేశానికి లక్ష్యం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. లేకుంటే ఊరికే ఉన్నామా అని అడిగారు. ఇదే సరైన సమయం అని, లక్ష్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా స్వాతంత్య్ర పోరాటం చేపట్టాలని, కొత్త ఉదయం దిశగా.. క్రాంతి మార్గంలో దేశం నడవాలన్నారు. సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ మలేషియా, లాంటి చిన్న దేశాలు ఎంతో ప్రగతి సాధించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
చైనా.. ఓ దశలో పేద దేశమని, కానీ ఇప్పుడు చైనా ఎలా ఉందా తెలుసా అని ప్రశ్నించారు. మనం ఎక్కడ ఉన్నామని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాల్సి అవసరం ఉందన్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి అధికారం రాలేదో చెప్పండి.. కాంగ్రెస్, శివసేన, బీజేపీలకు ప్రజలు అధికారం ఇచ్చారని, చేయాలనుకుంటే ఎవరైనా చేస్తారని, కానీ ఆ పార్టీలు ఏమీ చేయలేకపోయినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
రైతుల మంచి కోసం ఏదైనా చేయవచ్చు అన్నారు. తనకు మరాఠీ రాదు అని, కానీ అన్నీ అర్థం చేసుకోగలనన్నారు. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం.. ధనవంతమైన రాష్ట్రం అన్నారు. మహా నేతలు దివాళా తీస్తారని.. కిసాన్లకు దివాళీ వస్తుందన్నారు. భారత్ పరివర్తన్ మిసన్ నడుస్తోందన్నారు. పండరీ దర్శనం కోసం వస్తే.. దర్శనం చేసుకోండి.. కానీ రాజకీయం చేయకండి అన్నారని కొందరు నేతలు అన్నట్లు సీఎం తెలిపారు.
పండరీ పుణ్య స్థలం అని.. అక్కడ ఏమీ చెప్పలేదు.. కానీ ఇక్కడ అనకుండా ఉండలేనన్నారు. మహా నేతలు ఎందుకు ఆక్రోశానికి లోనవుతున్నారని ఆయన ప్రశ్నించారు. మేం ఎవరి టీమ్ కాదు.. కిసాన్ టీమ్ మాది.. అల్పసంఖ్యాకుల టీమ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. భాల్కే అన్నారని గుర్తు చేశారు.
తెలంగాణ, మహారాష్ట్ర కోసం ఏర్పడిన పార్టీ తమది కాదన్నారు. దేశంలో ఉన్న సమస్యలన్నింటికీ.. పరివర్త భారత్ కావాలన్నారు. కోట్లాది ఎకరాల సాగు భూమికి నీరును అందిస్తామన్నారు. ఔరంగబాద్‌లో 8 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయన్నారు. సోలాపూర్‌లో 5 రోజులకు ఒకసారి వస్తాయన్నారు. అకోలాలో కూడా నీళ్లు రావడం లేదన్నారు. కేంద్ర జలవిధానాన్ని బంగాళాఖాతంలో వేయాలన్నారు. జలనీతిని మార్చేస్తామన్నారు. నయా భారత్‌ను రూపొందిస్తామన్నారు. దేశంలో నీళ్లు లేవంటే అది మరో మాట అవుతుందని, కానీ నేతల మాయమాటలు చెప్పి నీళ్లు ఇవ్వలేకపోయినట్లు ఆరోపించారు.
బొగ్గు విద్యుత్తు, సోలార్ పవర్, హైడ్రో పవర్, థర్మల్ పవర్ మాత్రం దేశంలో ఎటువంటి సమస్య లేదన్నారు. ఆ బొగ్గు రిజర్వులు బిలియన్ల టన్నుల్లో ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నప్పుడు.. విద్యుత్తు సమస్య ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. హైడ్రో, సోలార్, బొగ్గును సమతుల్యం చేస్తే, అప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్తు సమస్య ఉండదన్నారు. 125 ఏళ్లకు కావాల్సినంత బొగ్గు మన దగ్గర ఉందన్నారు. రైతుల కోసం 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు ఒక్కటి కాకుంటే, మార్పు ఉండదన్నారు. రైతులు బ్రతికి ఉంటే ఎవరు జీవిస్తారు.. రైతులు మరణిస్తే ఎవరు బ్రతుకు తారని ఆయన అన్నారు. దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ 4వేలు ఇస్తోందన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కార్ వస్తే.. అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్నారు.
అమెరికాలో నల్లజాతి వారిని ఎంతో వేధించారని, కానీ బరాక్ ఒబామాను గెలిపించి అక్కడి ప్రజలు ఆ రుణం తీర్చుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. భారత్‌లో కూడా ఇలాంటి మార్పు రావాలని, రైతు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌తో భూముల్ని డిజిటలైజ్ చేసినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పథకాల అమలు .. మహారాష్ట్రలో ఎందుకు జరగవని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్‌లో చేరిన మరాఠీ నేత భగీరథ్ బాల్కేకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. పశ్చిమ మహారాష్ట్ర దర్వాజ్ ఓపెన్ చేసిన బాల్కేకు అండగా ఉంటామన్నారు. పండరీపుర వికాసం మొత్తం బాల్కే చేతుల మీదుగా జరుగుతుందన్నారు.
రైతు ఇంట్లో పుట్టాను, నేను స్వయంగా రైతును, రైతు సంక్షేమం కోసం పనిచేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. డిజిటల్ ఇండియా అని కేంద్రం చెబుతోందని, కానీ ఎందుకు భూముల్ని డిజిటైజ్ చేయడం లేదన్నారు. మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని చెబుతారని, కానీ ప్రతి వీధిలో చైనా బజార్ ఎందుకు కనిపిస్తున్నట్లు ఆయన ప్రశ్నించారు. దీపావళి బాంబులు, రంగులన్నీ చైనా నుంచే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. భారతదేశ పరివర్తనే అన్నింటికీ పరిష్కారం అన్నారు. ధరణి పోర్టుల్లో ఒకసారి రైతు డేటా ఎక్కితే, దాన్ని ఎవరూ మార్చలేరన్నారు.
ఒక్క రైతు బయోట్రిక్ ద్వారానే దాన్ని మార్చే వీలు ఉందన్నారు. తెలంగాణ రైతుల వద్ద పాస్‌పోర్టు లాంటి సుందరమైన పాస్ బుక్ ఉంటుందని అన్నారు. తాము ఎవరికీ టీం కాదు అని.. తమది రైతుల టీమ్, దళిత టీమ్ అన్నారు. రైతులు తోడుంటే ఎవరి అవసరం లేదన్నారు. అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ అని సీఎం కేసీఆర్ నినాదాలు చేశారు. తమ విధానంలో న్యాయం, నీతి ఉందన్నారు. మరాఠీ నేత భగీరథ్ బాల్కే ఇవాళ సర్కోలీలో జరిగిన సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)