Bhadrachalam Sita Rama Kalyanam: భక్తులు లేకుండా భద్రాద్రి సీతారాముల కల్యాణం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు
భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో (Bhadrachalam Temple) స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి.
Hyderabad, April 21: కరోనావైరస్ ప్రభావం భద్రాచలం సీతారాముల కళ్యాణంపై (Bhadrachalam Sita Rama Kalyanam) పడింది. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో (Bhadrachalam Temple) స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణానికి (Sita Ramula Kalyanam) రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సమర్పించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారి కల్యాణఘట్టం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కల్యాణ వేడుకకు హాజరయ్యారు. కరోనా కారణంగా ఆంతరంగికంగా రాములోరి కల్యాణం జరుగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వరుసగా రెండో ఏడాదీ భక్తుల లేకుండా స్వామివారి కల్యాణం జరుగుతోంది. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది.
Here's Updates
భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం భక్తుల లేకుండానే జరుగుతుంది. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాముల వారి కళ్యాణం కళ్లార చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భక్తులను అనుమతించలేదు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది అథితులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొందరు అర్చక స్వాములు రామయ్య తరఫున, మరికొందరు అర్చకులు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించి ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం జరగనుంది. కోవిడ్ కారణంగా ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.