Medaram Sammakka Sarakka Jatara: ఆసియాలో అతిపెద్ద జాతర, కన్నుల పండుగగా ప్రారంభమైన మేడారం సమ్మక్క సారక్క జాతర, ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న జాతర
ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది. గత జాతరకు 1.20 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ప్రకటించిన అధికారులు, ఈసారి కూడా అదేస్థాయిలో వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
Medaram. Feb 16: భక్తజనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే ఆదివాసీల వేడుక మేడారం జాతర (Medaram Sammakka Sarakka Jatara) ప్రారంభమైంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది. గత జాతరకు 1.20 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ప్రకటించిన అధికారులు, ఈసారి కూడా అదేస్థాయిలో వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవమైన మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర కు జనం కదిలి వచ్చి కడలిలా మారే అపురూప సన్నివేశం కన్నుల పండుగగా సాగనుంది.
ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం (Sammakka Saralamma Jatara ) కుంభమేళాను తలపిస్తుంది. నాలుగు రోజులు కుంభమేళా.. ఇలా ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలోని ఓ గిరిజన గ్రామం మేడారం. మేడారం జాతరను రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
దీంతో తొలిరోజు ఘట్టం పూర్తవుతుంది. గురువారం సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం కాగా, కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం చూసి తరించి అందరూ పులకించిపోతారు. సమ్మక్కను పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొని జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. 18న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వనప్రవేశం ఉంటుంది.
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేస్తోంది. టీఎస్‌ఆర్‌టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,850 బస్సులను నడుపుతోంది. మేడారం భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు వన్ వే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి పర్యవేక్షిస్తున్నారు.
గతంలో రెండే ప్రధాన రోడ్డు మార్గాలుండగా, ఈసారి ఆరింటిని ఏర్పాటు చేశారు. మేడారం జాతర ప్రదేశంలో 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణ కోసం 11 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ జాతర బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా 3.6 కిలో మీటర్ల పొడవునా స్నానఘట్టాలను, విడిది కోసం భవనాలను నిర్మించారు. వన దేవతల గద్దెల పక్కనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని వైద్యశాఖ ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్యసేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచింది.
1968 నుంచి ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్లు చేస్తోంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మొదట సమ్మక్క, సారలమ్మ జాతరలు వేర్వేరు గ్రామాల్లో జరిగేవి. సారలమ్మను సైతం కన్నెపల్లి నుంచి మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు చేర్చడం 1960 నుంచి మొదలైంది. అప్పటినుంచి మేడారం జాతర సమ్మక్క–సారలమ్మ జాతరగా మారింది. ప్రభుత్వ పరంగా 1944లోనే మేడారం జాతరపై తహసీల్దారుతో కమిటీ ఏర్పాటైనట్లు రికార్డులు చెబుతుండగా, 1967లో దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో వెలిసిన పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. ఆలయంలో మొక్కులు సమర్పించిన వడ్డెలు (పూజారులు) పగిడిద్దరాజు పడిగెను పట్టుకుని గ్రామం గుండా తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు పోస్తూ ‘వరుడై వెళ్లి మరుబెల్లికి రావయ్యా’అంటూ మొక్కులు చెల్లించారు. రాత్రి కర్లపెల్లి, లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో సేదదీరారు. వారిచ్చిన విందును ఆరగిఆంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి మేడారానికి పయణమవుతారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మేడారం చేరుకుంటామని ప్రధాన పూజారులు పెనక బుచ్చిరాములు, సురేందర్, రాజేష్, పురుష్తోతం తెలిపారు.