Aspirin-Heart Attack: గుండెపోటు వస్తే ఆస్పిరిన్ కాపాడుతుందా, అసలు డాక్టర్లు ఏమంటున్నారు, ప్రముఖ డాక్టర్ యనమదల మురళీ కృష్ణ విశ్లేషణాత్మక కథనం చదవండి
ఒక మాదిరి నుండి తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారిలో అనేక సమస్యలు దీర్ఘకాలం వేధిస్తుండడం మనకు తెలిసిందే. తీవ్రమైన నిస్సత్తువ, ఒంటి నొప్పులు, ఆయాసం, గుండె దడ, ఎంతకూ తగ్గని దగ్గు ఇలా అనేక రకాల సమస్యలతో... కోవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఒక మాదిరి నుండి తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారిలో అనేక సమస్యలు దీర్ఘకాలం వేధిస్తుండడం మనకు తెలిసిందే. తీవ్రమైన నిస్సత్తువ, ఒంటి నొప్పులు, ఆయాసం, గుండె దడ, ఎంతకూ తగ్గని దగ్గు ఇలా అనేక రకాల సమస్యలతో... కోవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే, కొందరు కోవిడ్ బాధితులు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలి, అక్కడికక్కడే చనిపోవడం వింటున్నాం. గతంలో గుండెపోటుతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరడం, స్టెంట్స్ అవసరం కావడం, ఇంకా ఇబ్బందికరం అయితే బైపాస్ సర్జరీ... ఇలా ఉండేది కాస్తా, ప్రస్తుతం తక్షణ మరణాలను గురించి వింటున్నాం. దీనికి కారణాలను అన్వేషిద్దాం... పరిష్కారాలను యోచిద్దాం.
గుండెజబ్బులలో దీర్ఘకాలంగా ఆస్పిరిన్ వాడకం అనేది మనందరికీ తెలిసిందే. ఆస్పిరిన్ అనేది నాన్ స్టెరాయిడల్ ఏంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAID) తరగతి కిందికి వస్తుంది. ఈ NSAIDలలో యితర మాలిక్యూల్స్ కి లేని ఒక విశేషమైన గుణం ఆస్పిరిన్ కి వుంది... అది రక్తం గడ్డకట్టకుండా నిరోధించడమనే లక్షణం. ఏంటి - ప్లేట్లెట్ ఏగ్రిగేటర్ అంటారు. గడ్డ కట్టడానికి రక్తంలోని కొన్ని ప్లేట్ లెట్స్ ఒకచోట కట్టకట్టుకొని చేరడాన్ని ఈ ఏస్పిరిన్ అడ్డుకుంటుంది.
ఈ లక్షణంతోనే గుండె రక్తనాళాల జబ్బు ( కొరొనరీ ఆర్టెరీ డిసీజస్ ), స్ట్రోక్, హైబీపీ, డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో త్రాంబస్ ఏర్పడకుండా, ప్రాణాపాయం కలగకుండా వుండడానికి ఏస్పిరిన్ యిస్తారు. ఏస్పిరిన్ యివ్వడం అనేది కొన్ని వారాలో, నెలలో కాదు - సంవత్సరాలపాటు, దశాబ్దాల కాలం జీవిత పర్యంతం గుండె, బి.పి, డయాబెటిస్ తదితర రోగులకు యిస్తుంటారు.
Here's Doctor Statement
మానవ శరీరం, తనకు ఏదైనా హాని జరిగేటప్పుడు నిలువరించడానికి, రక్షణకు గానూ అనేక ఏర్పాట్లు చేసుకొంది. అందులో ఇన్ ఫ్లమేషన్ ఒకటి. వ్యాధికారక సూక్ష్మ క్రిముల క్రియాశీలతను కట్టడి చేయడానికి ఈ ఇన్ ఫ్లమేషన్ దోహదం చేస్తుంది. అయితే, కోవిడ్ జబ్బులో శరీర స్పందన అదుపుతప్పి... హెచ్చుస్థాయిలో ఇన్ ఫ్లమేషన్ కావడం అనేది అతి పెద్ద సమస్య . దీని పర్యవసానంగా, రక్తం గడ్డ కట్టే ప్రక్రియ ప్రేరేపితం కావడం, దెబ్బతిన్న కణజాలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి లోనుకావడం జరుగుతుంది.
ఈ వ్యాధి క్రమము (పాథోఫిజియాలజీ)ని 'ఇన్ ఫ్లమేషన్ - కొయాగ్యులేషన్ - (బ్యాక్టీరియల్ ) ఇన్ఫెక్షన్' [ I-C-I ] గా చెప్పుకొన్నాం. నిజానికి కోవిడ్ జబ్బుకు కారణమైన కొరోనావైరస్ దాదాపు అందరు పేషెంట్లలో 10 నుండి 20 రోజులలో మరుగు అవుతుంది. వైరస్ లేకపోయినప్పటికీ అది కలుగజేసిన ఇన్ ఫ్లమేషన్ డ్యామేజీ మూలంగానే ఇప్పుడు మనం చూస్తున్న దీర్ఘకాలంపు సమస్యలు తలెత్తుతున్నాయి . ఈ ఇన్ ఫ్లమేషన్ ను కూడా శరీరం నెమ్మదిగా ఉపశమింప చేసుకుంటుంది. అయినప్పటికీ, కొందరిలో కొనసాగుతూ ఉన్న ఇన్ ఫ్లమేషన్ రక్తపు గడ్డ ( థ్రాంబస్ )ఏర్పడటానికి , ఆ గడ్డ కాస్తా వేరేచోట నాళంలో రక్తసరఫరాని అడ్డుకోవడాని ( ఎంబోలిజం ) కి దారితీసి, గుండెపోటు వంటి తీవ్రమైన ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కలుగుతుంది.
సంప్రదాయకంగా వైద్య పరిశోధనలు... సంవత్సరాలు, దశాబ్దాల తరబడి సాగుతాయి. క్రోడీకరించిన బోలెడంత డేటాను విశ్లేషించి కాని... కొత్త మార్గదర్శకాలను ఇవ్వరు. సునామీలా విరుచుకుపడ్డ కోవిడ్ జబ్బు విషయంలో హాస్పిటల్స్ లో చేరిన వారికి ఏంటికొయాగ్యులంట్ ఇవ్వడం ప్రామాణికంగా వుంది. కానీ తర్వాతి కాలంలో రక్తపు గడ్డలు ఏర్పడకుండా నిరోధించడానికి ఇచ్చే ఔషధాల విషయంలో సరైన మార్గదర్శకాలు లేవు. ఎక్కువ మందికి ఇటీవలి కాలంలో ఉనికిలోకి వచ్చిన, ఖరీదైన ఫాక్టర్ 10ఎ మీద పనిచేసే ఏంటికొయాగ్యులంట్ కొన్ని వారాల పాటు ఇచ్చి, తర్వాత నిలిపివేస్తున్నారు.
నిజానికి ఈ రకమైనటువంటి థ్రాంబోఎంబోలిజం ప్రమాదాల నివారణకు గాను ఏస్పిరిన్ దశాబ్దాల తరబడి వినియోగంలో వుంది. ఏస్పిరిన్ యొక్క పనితనం, భద్రత సందేహాలకు అతీతంగా రుజువైంది. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో కేవలం ఏస్పిరిన్ వినియోగం మూలంగా పదుల కోట్ల మంది గుండెపోటుకు గురికాకుండా రక్షణ పొందారు. రక్తపోటు, డయాబెటిస్, మెదడు స్ట్రోక్, గుండెపోటు, అధిక కొలస్టెరాల్ తో సహా అనేక ఆరోగ్య సమస్యలలో ఏస్పిరిన్ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి... ఇంకా చెప్పాలంటే జీవించినంత కాలమూ చాలామంది పేషెంట్లలో వాడటం అందరికీ తెలిసిందే.
ఏస్పిరిన్ చాలా సురక్షితమైనది. డిస్ప్రిన్, అనాసిన్ పేరిట డాక్టర్ సిఫార్సు లేకుండా, ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఉత్పత్తిగా అందుబాటులో వున్న మాత్రలో 325 మిల్లీగ్రాములు ఏస్పిరిన్ ఉంటుంది. కడుపులో అల్సర్లు, రక్తస్రావం ప్రమాదాలు ఉన్నవారికి మాత్రం ఏస్పిరిన్ వాడరాదు. ఒక మోస్తరు నుండి ఎక్కువ తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారు... తక్కువ మోతాదు అనగా 75 మిల్లీగ్రాముల ఏస్పిరిన్ మాత్ర ఒకటి మధ్యాహ్నం భోజనం తర్వాత కనీసం రెండు సంవత్సరాల పాటు వాడటం అన్ని విధాలా శ్రేయస్కరం. దశాబ్దాల పాటు వైద్య పరిశోధనలు సాగి, ఈ తరహా మార్గదర్శకాలు వచ్చేనాటికి విలువైన అనేక వేల, లక్షల ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకుందాం. ఆత్మీయులను మనతో ఉంచుకుందాం.
ఇజ్రాయెల్., అమెరికాల తాజా పరిశోధనలు సూచిస్తున్నది ఏమిటంటే..... ఏస్పిరిన్ వాడకం మూలంగా కొరొనావైరస్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తగ్గవచ్చును - ప్రైమరీ ప్రివెన్షన్ అనగా కోవిడ్ ను నిరోధించడానికి వాడుకోగల అవకాశం వుంది. అలాగే కోవిడ్ బారిన పడ్డ వారిలో దుష్పరిణామాలూ, ప్రాణాపాయాన్ని తగ్గించడానికి - సెకండరీ ప్రివెన్షన్ కి కూడా అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సివుంది.
గమనిక: ఇది వైద్య సలహా కాదు, కేవలం అవగాహనకు మాత్రమే.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)