Paidithalli Sirimanotsavam: అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు

సుధారాణి పూర్తి వివరాలను మీడియాకు తెలియజేశారు.

Paidithalli Sirimanotsavam (Photo-X)

Vijayanagaram, August 31: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఇల‌వేల్పు అయిన శ్రీపైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం అక్టోబ‌ర్ 31న నిర్వ‌హించ‌నున్నట్లు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్, ఆల‌య ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను మీడియాకు తెలియజేశారు. అక్టోబ‌ర్ 4వ తేదీ ఉద‌యం 11.00 గంట‌ల‌కు పందిర రాట వేయ‌టంతో ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. స్థానిక వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్యాణ మండ‌పంలో గురువారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆల‌య‌ క‌మిటీ స‌భ్యుల స‌మ‌క్షంలో పైడిత‌ల్లి ఉత్స‌వ తేదీల‌ను ఆమె ప్ర‌క‌టించారు.

తిథి, వార న‌క్ష‌త్రాల‌ను అనుస‌రించి నిర్ణ‌యించిన‌ ముహుర్తం ప్ర‌కారం అక్టోబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని ఈవో సుధారాణి తెలిపారు. అక్టోబ‌ర్ 30న తొలేళ్ల ఉత్స‌వం ఉంటుంద‌ని, మ‌రుస‌టి రోజు అక్టోబ‌ర్ 31న అంగ‌రంగ వైభవంగా సిరిమానోత్స‌వం జరుగుతుంద‌న్నారు. అలాగే నవంబ‌ర్ 7వ తేదీన పెద్ద‌చెరువు వ‌ద్ద తెప్పోత్స‌వం, 14వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్స‌వం ఉంటుంద‌ని వివ‌రించారు.

అప్పుల్లో కూరుకుపోయారా, ఈ లక్ష్మీ స్తుతిని ప్రతి శుక్రవారం చదివితే చాలు నట్టింట్లో కనక వర్షం కురుస్తుంది..

అక్టోబ‌ర్ 4వ తేదీ ఉద‌యం 8.00 గంట‌ల‌కు చ‌దురుగుడి వ‌ద్ద మండ‌ల‌ దీక్ష‌లు, అక్టోబ‌ర్ 25న అర్ధమండ‌లి దీక్ష‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. న‌వంబ‌ర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల‌కు వ‌నం గుడి నుంచి క‌ల‌శ జ్యోతి ఊరేగింపు ఉంటుంద‌ని వివ‌రించారు. న‌వంబ‌ర్ 15న ఛండీహోమం, పూర్ణాహుతితో వ‌నంగుడి వ‌ద్ద‌ దీక్ష విర‌మ‌ణ‌తో ఉత్స‌వాలు ముగుస్తాయ‌ని సుధారాణి పేర్కొన్నారు. అనంతరం ఆల‌య క‌మిటీ స‌భ్యులతో కలిసి ఉత్స‌వ తేదీల‌తో కూడిన గోడ‌ప‌త్రిక‌ను ఆవిష్క‌రించారు