TTD: తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, 12 టికెట్లను రూ.32 వేలకు బ్లాక్‌లో శ్రీవారి దర్శనం టికెట్లను విక్రయించిన కాణిపాకం ఆలయ ఉద్యోగిని, కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు
వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీరికి 20 గంటల్లో (Sarva darshan queue stretches up to 20 hours) దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 84,878 మంది భక్తులు దర్శించుకోగా 41,016 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
శ్రీవారి దర్శన టికెట్లను (Sarva darshan Tickets in Black) బ్లాక్‌లో విక్రయించిన కాణిపాకం సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరుణ అనే ఉద్యోగిని సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించింది . కాణిపాకం ఏఈవో మాధవరెడ్డి సిఫార్సు లేఖతో 12 టికెట్లు పొందగా వాటిని కాణిపాకం దేవస్థానంలో గ్యాస్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న కరుణ కర్నాటకకు చెందిన భక్తులకు రూ. 32 వేలకు విక్రయించింది. దీంతో కర్నాటక భక్తులు టీటీడీ (TTD) విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిపై కేసు నమోదు చేశామని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. కాణిపాకం ఏఈవో మాధవరెడ్డిని కూడా ఈ కేసులో ప్రశ్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.
శ్రీవారి ఆలయంలో నవంబర్ ఒకటో తేదీన పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం 31న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ చేయనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పుష్పయాగం నేపథ్యంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.
నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పెద్ద శేషవాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు.
అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు.
టీటీడీ ఆధ్వర్యంలో మూడు చోట్ల కార్తీక దీపోత్సవాలను నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. నవంబరు 7న యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా ఆలయాల డిప్యూటీ ఈవో లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి తగినంతమంది గాయకులను కార్తీక దీపోత్సవాలకు పంపడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్తీక మాసం విశిష్టత, భక్తులు చేయాల్సిన, చేయకూడని పనులు తెలిపే కరపత్రాలు ప్రెస్ ప్రత్యేకాధికారి సిద్ధం చేయాలని జేఈవో అన్నారు. స్టేజీ, బారికేడ్లు, ఇతర ఇంజినీర్ ఏర్పాట్ల పనులు ముందుగానే చేపట్టాలని చీఫ్ ఇంజినీర్‌కు సూచించారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
శ్రీనివాస సేతు నిర్మాణం పెండింగ్ పనులన్నింటినీ డిసెంబరు 31 లోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వంతెన పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసినట్లయితే తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చునన్నారు.