Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Hyderabad, July 20: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాయిబాబాను దర్శించుకున్న పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా నిర్వహించడం ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా ప్రజల నమ్మకం. జగతిని జాగృతపరిచిన గురుదేవులను నేడు పూజించడం ఆనవాయితీగా వస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో శోభ
ఇక గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమకొండలోని బాలసముద్రం సాయిబాబా గుడిలో భక్తులు బారులుతీరారు. ఖమ్మంలో బాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లోని అమిస్తాపూర్ సాయిబాబా గుడిలో, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండతో పాటు ఏపీలోని పలు ఆలయాల్లో సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి శోభ నెలకొన్నది.