TTD Divya Darshan Tokens: తిరుమల కొండ పైకి నడిచి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, దారిలోనే దివ్య దర్శన టోకెన్లు జారీ, విఐపీ టికెట్లు భారీగా తగ్గింపు
అలిపిరి నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు రోజూ 10 వేల టోకెన్లు (Divya Darshan tokens) జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వెల్లడించారు.
Tirumala, Mar 27: భక్తుల కోరిక మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. అలిపిరి నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు రోజూ 10 వేల టోకెన్లు (Divya Darshan tokens) జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వెల్లడించారు.
అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్లపై సుబ్బారెడ్డి సమీక్షించారు. ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను తెలియజేశారు.నడక దారిలోనే ఈ మేరకు టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో బ్రేక్ సిఫారసు లేఖలను తగ్గిస్తామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
దాదాపు మూడేళ్లుగా నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. కరోనాకు ముందు నుంచీ జారీ చేయడం లేదు. ఈ టికెట్లను పునరుద్ధరించాలంటూ చాలా రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. నడిచి వచ్చే వారికి, వాహనాల్లో వచ్చే వారికి ఒకే క్యూలైన్ కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెట్లు ఎక్కి వచ్చే వారికి టోకెన్లు జారీచేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
వివరాలు ఇవే..
► ఏప్రిల్ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300/` దర్శన టికెట్లు తగ్గించనున్నారు.
► ఈ మూడు నెలల పాటు వీఐపీలు సిఫారసు లేఖలను తగ్గించేలా చూడటం.
► ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్ పెయింట్.
► తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగింది.
► మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్, పిఏసి`2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం.
► అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచడం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు.
► ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు.
► భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ.
► టీటీడీ విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడటం.
► శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించడం.