Anand Mahindra On Teamwork: ‘ఒక పక్షి ఇసుక తవ్విపోస్తుంటే.. మరో పక్షి వెనక్కి నెడుతున్న తీరు’.. టీమ్ వర్క్ పై కళ్లు తెరిపించే వీడియో.. ఆనంద్ మహీంద్రా పోస్ట్.. వైరల్
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ కు రోజూ కొంత సమయం కేటాయిస్తుంటారు. టీమ్ వర్క్ పై కళ్లు తెరిపించే వీడియోను ఇటీవల ఆయన పోస్ట్ చేశారు.
Hyderabad, Nov 25: మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) గ్రూపు చైర్మన్ గా (Chairman) ఉన్నప్పటికీ.. ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్విట్టర్ కు (Twitter) రోజూ కొంత సమయం కేటాయిస్తుంటారు. తద్వారా తనను అనుసరించే కోటి మంది ఫాలోవర్లతో (Followers) పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. అవేవీ కాలక్షేపం కబుర్లు మాత్రం కావు. సమాచారం, విజ్ఞానం, వినోదంతో కూడి ఉంటాయి. పెద్దగా ఎవరికీ తెలియని విషయాలు, ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా టీమ్ వర్క్ (Team Work) ఎలా ఉండకూడదో చెబుతూ.. ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఈ వీడియోలో ఓ పక్షి ఇసుకను కాలితో పైకి ఎగదోస్తూ గోయి తవ్వుతుంటే.. ఒడ్డున ఉన్న మరో పక్షి తిరిగి అదే గోతిలోకి ఇసుకను నెడుతుంటుంది. దీన్ని చూస్తే కచ్చితంగా నవ్వొస్తుంది. కానీ, టీమ్ వర్క్ అంటే ఇలా ఉండకూడదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘‘ కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు మధ్యలో మీరు ఇలా చేస్తున్నట్టు ఉంటుంది. కానీ, మీరంతా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నది గుర్తు పెట్టుకోవాలి’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కొన్ని సందర్భాల్లో నిజంగా ఇలానే జరుగుతుందని యూజర్లు కామెంట్ చేస్తున్నారు.