Baby with 26 Fingers: 26 వేళ్లతో ఆడబిడ్డ జననం.. ఒక్కో చేతికీ ఏడు వేళ్లు, ఒక్కో కాలికి ఆరు వేళ్లతో బాలిక జననం.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో అత్యంత అరుదైన ఘటన.. ధోలాఘడ్ అమ్మవారు తమ ఇంట అవతరించిందంటూ కుటుంబసభ్యుల సంబరం
కానీ మొత్తం 26 వేళ్లతో ఆడబిడ్డ పుట్టిన అసాధారణ ఘటన రాజస్థాన్‌లో తాజాగా చోటుచేసుకుంది.
Jaipur, Sep 18: మనుషులకు ఆరు వేళ్లు (Six Fingers) ఉండటమే అరుదైన విషయం. కానీ మొత్తం 26 వేళ్లతో ఆడబిడ్డ (Baby Girl) పుట్టిన అసాధారణ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) తాజాగా చోటుచేసుకుంది. దీంతో, బిడ్డ తల్లిదండ్రులతో పాటూ ఇతర కుటుంబసభ్యులు శిశువును అమ్మవారి అవతారంగా భావిస్తూ మురిసిపోతున్నారు. అమ్మతల్లే తమ ఇంట కాలిడిందంటూ తమ అదృష్టాన్ని తలుచుకుని సంబరపడుతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే..
అసలేం జరిగిందంటే?
భరత్ పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల సర్జూ దేవి ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, అసాధారణ రీతిలో శిశువు ఒక్కో చేయికి ఏడు వేళ్లు, ఒక్కో కాలికి ఆరు వేళ్లు చొప్పున మొత్తం 26 వేళ్లతో జన్మించింది. అది మినహా బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో ఆ కుటుంబం శిశువును ధోలాఘడ్ దేవి అమ్మవారి అవతారంగా భావిస్తోంది. బిడ్డ తండ్రి గోపాల్ భట్టాచార్య సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.
జన్యుక్రమంలో మార్పులే..
అయితే, వైద్యులు మాత్రం శిశువు జన్యుక్రమంలో మార్పులే అదనపు వేళ్లకు కారణమని చెబుతున్నారు. అన్ని వేళ్లు ఉన్నంత మాత్రాన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఇది అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు.