False Fire Alarm: రైలులో మంటలు అంటుకున్నాయని పుకార్లు షికార్లు.. భయంతో నడుస్తున్న రైలు నుంచి దూకిన పలువురు ప్రయాణికులు.. ఎదురుగా మరో ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల మృతి.. ఝార్ఖండ్ లో ఘోరం
పుకార్లను నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని రుజువుచేసే ఘటన ఇది.
Newdelhi, June 15: పుకార్లను నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని రుజువుచేసే ఘటన ఇది. రైలులో (Train) మంటలు చెలరేగాయన్న పుకార్లను నమ్మి నడుస్తున్న అదే రైలు నుంచి దూకి ముగ్గురు ప్రాణాలను కోల్పోయిన ఘటన ఝార్ఖండ్ లోని కుమన్ డీహ్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాంచీ-ససరామ్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో మంటలు (Fire) అంటుకున్నాయన్న పుకార్లు ఒక్కసారిగా వెలువడ్డాయి. ఇదే సమయంలో రైలులో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు కూడా . దీంతో ఆయన రైలును నిలిపి వేయాలంటూ సిగ్నల్ చూయించాడు.
మరో ట్రాక్ పై దూకడంతో..
స్టేషన్ లో ఆగడానికి రైలు స్లో అయిన సందర్భంలో.. అప్పటికే మంటలు వ్యాపిస్తున్నాయని భయపడిపోయిన కొందరు ప్రయాణికులు నడుస్తున్న రైలు నుంచి దూకేశారు. ఈ క్రమంలో అదే సమయంలో మరో ట్రాక్ పై నుంచి వస్తున్న గూడ్స్ రైలు వారిని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.