Criminalise Adultery: వ్యభిచారం క్రిమినల్ నేరమే.. ప్రభుత్వానికి మళ్లీ సిఫారసు చేయనున్న పార్లమెంటు కమిటీ? అసలేంటీ విషయం??
వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది.
Newdelhi, Oct 28: వ్యభిచారాన్ని క్రిమినల్ (Criminalise Adultery) నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ (Parliamentary Committee) సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ (IPC), సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లకు బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం వీటిని స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉన్నది. కమిటీ తదుపరి సమావేశం నవంబరు 6న జరుగుతుంది.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టు 2018లో తీర్పు చెప్పింది. ఇప్పుడు దీన్ని సవాల్ చేస్తూ పార్లమెంటరీ కమిటీ వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.