Bilimoria Praises Modi: భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ.. బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంస (వీడియోతో)
చిన్నతనంలో చాయ్ అమ్మిన పిల్లాడు నేడు భారత ప్రధానియై భూమిపై అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారని కీర్తించారు.
London, Jan 22: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా (Lord Karan Bilimoria) పొగడ్తలతో ముంచెత్తారు. భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ అని ప్రశంసించారు. చిన్నతనంలో చాయ్ (Chai) అమ్మిన పిల్లాడు నేడు భారత ప్రధానియై భూమిపై అత్యంత శక్తిమంతమైన (Powerful) నేతగా ఎదిగారని కీర్తించారు. భారత్- బ్రిటన్ సంబంధాల ప్రాధాన్యత అంశంపై పార్లమెంట్‌లో జరిగిన డిబేట్ సందర్భంగా కరన్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ20 నాయకత్వ బాధ్యతలు తీసుకున్న భారత్ ప్రపంచంలో రెండో బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగే లక్ష్యం పెట్టుకుందని లార్డ్ కరన్ బిలిమోరియా అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందనుందని చెప్పారు.
రానున్న దశాబ్దాల్లో కూడా భారత్‌కు బ్రిటన్ నమ్మకమైన స్నేహ దేశంగా ఉంటుందని చెప్పారు. బ్రిటన్‌ను దాటేసిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగిందన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంతో భారత్ యువ దేశంగా ఉందని గడచిన ఆర్ధిక సంవత్సరంలో 8.7 వృద్ధి రేటు సాధించిందన్నారు. యూనికార్న్ కంపెనీల విజృంభణ మొదలైందని, పునరుత్పాదక శక్తి, సౌర శక్తి ఉత్పాదనలో భారత్ నాలుగో పెద్ద దేశంగా నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు తయారు చేసి బిలియన్ల మందికి అందజేసి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకుందని ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్‌తో బ్రిటన్ ఆర్ధిక సంబంధాలు మరింత బలపడాలని లార్డ్ కరన్ బిలిమోరియా ఆకాంక్షించారు.