Viral News: బొమ్మలా నిలబడి నగల షాపులో యువకుడు చోరీ.. పోలాండ్ లోని వార్సా నగరంలో ఘటన.. చివరికి ఏమైంది??
షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు.
Warsaw, Oct 20: పోలాండ్ (Poland) లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు. వార్సా (Warsaw) నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తొలుత ఓ షాపింగ్ సెంటర్ లోని జువెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు.
ఇలా దొరికాడు
షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత ఓ రెస్టారెంట్ కు వెళ్లి సుష్టుగా తిని ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. కానీ చివర్లో అతడికి దురదృష్టం వెంటాడడంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.