Supreme Court: అక్రమ సంబంధాలతో పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు.. సుప్రీం కోర్టు స్పష్టీకరణ
వివాహేతర సంబంధం వల్ల కలిగిన సంతానానికీ వారి తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. పురుషులతో పాటు మహిళలకు కూడా ఈ హక్కులు వర్తిస్తాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
Newdelhi, Sept 2: వివాహేతర సంబంధం వల్ల కలిగిన సంతానానికీ వారి తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్తిలో (ancestral property) వాటా పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు (Supreme Court) వెల్లడించింది. పురుషులతో పాటు మహిళలకు కూడా ఈ హక్కులు వర్తిస్తాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. చెల్లుబాటు కానటువంటి, రద్దయ్యే అవకాశం ఉన్న వివాహాల ద్వారా కలిగిన సంతానం కూడా చట్టబద్ధ వారసులేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఓ అభ్యర్థనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. హిందూ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధాల్లోని సంతానానికీ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తికి చట్టబద్ధమైన వారసులని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబపు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని వివరించింది. అక్రమ సంతానానికి ఈ హక్కు ఉండదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత ధర్మాసనం విభేదించింది.