Heated Conversation: మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం
గత నెల జరిగిన మ్యాచ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం (Heated conversation) చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంభీర్ స్టేడియంలోకి వచ్చి.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు వేలు చూపిస్తు సంజ్ఞ చేశాడు.
Lucknow, May 02: ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు జట్ల మధ్య పోరు సాగుతోంది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంతగడ్డపై లక్నో జట్టు ఓడించింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టును బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో ఓడించింది. లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), విరాట్ కోహ్లీనే (Virat Kohli) గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం (Heated conversation) చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంభీర్ స్టేడియంలోకి వచ్చి.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు వేలు చూపిస్తు సంజ్ఞ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సోమవారం రాత్రి ఇరు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగగా.. లక్నో ఓటమి పాలైంది. లక్నో తొలుత బౌలింగ్ చేయగా.. ఆర్‌సీబీని (RCB) నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో.. 108 పరుగులకే కుప్పకూలిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా ఒకరినొకరు కరచాలనం చేసుకున్నారు. ఈ క్రమంలో గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్తూ కొట్టుకొనేంత పనిచేశారు. వీరి మధ్య వాగ్వివాదం తీవ్రరూపందాల్చే క్రమంలో ఇరుజట్ల సభ్యులు వారిని పక్కకు తీసుకెళ్లారు. దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా (Viral) మారాయి.
గత మ్యాచ్‌లో లక్నో విజయం తరువాత గంభీర్ మైదానంలోకి వచ్చి అభిమానులవైపు చూస్తూ నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా క్యాచ్ అందుకున్న కోహ్లీ గంభీర్‌లా చేయకూడదని సూచిస్తూ ముద్దు పెడుతున్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ విషయంలో మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. అంతేకాక.. లక్నో టీం సభ్యుడు అమిత్ మిశ్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనూ విరాట్ అతనితో కూడా వాగ్వావాదానికి దిగడం కనిపించింది. దీంతో అంపైర్లు వచ్చి వారిని శాంతింపజేశారు.
ఈ విషయంలోనూ గంభీర్ కోహ్లీని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఇప్పుడే కాదు.. ఐపీఎల్ 2013 సీజన్‌లోనూ కోహ్లీ, గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పడు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, ఈసారి లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ గా కోహ్లీ ఉన్నాడు.