IND vs SA, 2nd T20I: సఫారీలతో టీ20 సీరిస్, ఓటమితో ఆరంభించిన టీమిండియా, వాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని తెలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దు కాగా.. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించింది. దీంతో సఫారీలు 15 ఓవర్లలో 152 పరుగులను చేధించాల్సి వచ్చింది.

Suryakumar Yadav (Photo Credits: @CricCrazyJohns/ Twitter)

భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీ‌స్లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దు కాగా.. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించింది. దీంతో సఫారీలు 15 ఓవర్లలో 152 పరుగులను చేధించాల్సి వచ్చింది. అయినా ఎలాంటి ఒత్తిడీ లేకుండా ఆరంభం నుంచే విరుచుకుపడి అవలీలగా మ్యాచ్‌ను ముగించారు. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన ఆతిథ్య జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడింది. దీంతో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఓటమిపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. మెరుగైన స్కోరు సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామన్నాడు.

మహ్మద్‌ షమీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లు వెనక్కి, ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్న ట్రావిస్‌ హెడ్‌

సగం ఇన్నింగ్స్‌ పూర్తయ్యే వరకు.. మేము మెరుగైన స్కోరే చేశామని భావించాం. అయితే, వాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా మొదటి 5-6 ఓవర్లలోనే మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా బెరుకు లేకుండా మమ్మల్ని మేము నిరూపించుకోవాలన్న తపనతోనే మైదానంలో దిగాం. అందుకు తగ్గట్లుగానే మా ప్రణాళికలను అమలు చేశాం. వికెట్‌ పచ్చిగా ఉండటంతో ఆరంభంలో బ్యాటింగ్‌ చేయడం కాస్త కష్టంగా తోచింది. భవిష్యత్‌ మ్యాచ్‌లలోనూ ఇలాంటి కఠిన పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. మాకు ఇదొక గుణపాఠం’’ అని పేర్కొన్నాడు.

ఇక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న సూర్య.. ప్రస్తుతం దృష్టి మొత్తం తదుపరి మ్యాచ్‌పైనే కేంద్రీకృతం చేశామని వెల్లడించాడు. కాగా ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20లలో తలపడిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఏకంగా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌కు కూడా సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.