IPL 2022: ముంబై మరో చెత్త రికార్డు, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అయితే ఈ దశలో ఆల్‌రౌండర్లు లలిత్ యాదవ్( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లోమెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక ముంబై 2012 నుంచి తొలి మ్యాచ్‌లో ఓడిపోతూ వచ్చింది. తాజాగా మరోసారి ఓటమిని మూటగట్టుకొని చెత్త రికార్డును నిలబెట్టుకుంది. కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (81 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో తుదికంటా నిలిచాడు.
అనంతరం ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. అయితే 14వ ఓవర్‌లో శార్దూల్ వికెట్ కోల్పోయాక ఢిల్లీ విజయం కష్టమే అనిపించింది. 17వ ఓవర్ వరకు మ్యాచ్ ముంబై వైపే కనిపించింది. కానీ లలిత్-అక్షర్ జోడీ మాత్రం పట్టు వీడలేదు. 18వ ఓవర్‌లో అక్షర్ రెండు సిక్సర్లు, లలిత్ 6,4తో 24 రన్స్ రాబట్టడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది.
ముంబై: 20 ఓవర్లలో 177/5 (ఇషాన్ 81 నాటౌట్, రోహిత్ 41, తిలక్ వర్మ 22; కుల్దీప్ 3/18, ఖలీల్ 2/27).
ఢిల్లీ: 18.2 ఓవర్లలో 179/6 (లలిత్ 48 నాటౌట్, అక్షర్ 38 నాటౌట్, పృథ్వీ షా 38; థంపీ 3/35, ఎం.అశ్విన్ 2/14).