IPL 2022: ముంబైని గెలిపించని బుమ్రా మ్యాజిక్, 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సీజన్‌లో ఐదో విజయం నమోదు
జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్లతో అదరగొట్టినా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసి సీజన్‌లో ఐదో విజయం నమోదు చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్లతో అదరగొట్టినా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసి సీజన్‌లో ఐదో విజయం నమోదు చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా.. శ్రేయస్ అయ్యర్ (6), రస్సెల్ (9), షెల్డన్ జాక్సన్ (5), కమిన్స్ (0) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 17.3 ఓవర్లలో113 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ రోహిత్ శర్మ (2).. అంపైర్ ఇచ్చిన సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (6) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. రమన్‌దీప్ సింగ్ (12), టిమ్ డేవిడ్ (13), పొలార్డ్ (15), సమ్స్ (1) ఆకట్టుకోలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ 3, రస్సెల్ 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం లక్నోతో గుజరాత్ తలపడనుంది.