U-19 World Cup Final: కప్ గెలిచారు,గేమ్ స్పిరిట్ కోల్పోయారు, తొలిసారి విశ్వ విజేతలైన బంగ్లా బేబీలు, డిఫెండింగ్ చాంఫియయన్ భారత్‌ను వెంటాడిన వర్షం

ప్లేయర్ల మధ్య కవ్వింపు చర్యలు సాధారణమే అయినప్పటికీ బంగ్లాదేశ్ యువ ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్లకు పోటినిచ్చేలా తమ కవ్వింపు చేష్టలను ప్రదర్శించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పేసర్ హసన్ ఈ విషయంలో మరీ దూకుడు ప్రదర్శించినట్లుగా వీడియోల్లో తెలుస్తోంది.

Bangladesh win U19 CWC 2020. (Photo Credits: @cricketworldcup/Twitter)

Potchefstroom, Febuary 10: క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఆ దేశం ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క కప్ కూడా సాధించలేదు. ఎట్టకేలకు అండర్‌-19 ప్రపంచకప్‌ (Under 19 World Cup) సాధించి తొలిసారిగా విశ్వ విజేత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో (Under 19 World Cup Final) టీమిండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి బంగ్లాదేశ్‌ (Bangladesh) సగర్వంగా ట్రోఫీని అందుకుంది. చివర్లో వర్షం ఆటకు కాసేపు అంతరాయం కలిగించగా.. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆటను 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు.

బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ 43పరుగులతో అజేయంగా నిలిచి అండర్‌-19 క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇతనికి తోడుగా బంగ్లా ఓపెనర్‌ పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ 47 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 4వికెట్లు, సుషాంత్‌ మిశ్రా 2వికెట్లు తీశారు. కాగా 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను కెప్టెన్‌ అక్బర్‌ అలీ, ఓపెనర్‌ పర్వేజ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

Here's ICC Video

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు (India) 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైశ్వాల్‌ 88 పరుగులతో మరోసారి రాణించగా, తిలక్‌ వర్మ 38, దృవ్‌ జూరెల్‌ 22 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌ 3వికెట్లు, శౌరిఫుల్‌ ఇస్లామ్‌, తంజిమ్‌ హసన్‌ తలా 2వికెట్లు తీశారు.

అక్బర్‌ అలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. యశస్వి ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడి 400 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో అతను మూడు వికెట్లు కూడా తీశాడు. భారత్‌కే చెందిన రవి బిష్ణోయ్‌ (6 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

అయితే ఈ మ్యాచ్ లో ఆటగాళ్ల మధ్య స్పిరిట్ కొరవడింది. ప్లేయర్ల మధ్య కవ్వింపు చర్యలు సాధారణమే అయినప్పటికీ బంగ్లాదేశ్ యువ ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్లకు పోటినిచ్చేలా తమ కవ్వింపు చేష్టలను ప్రదర్శించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పేసర్ హసన్ ఈ విషయంలో మరీ దూకుడు ప్రదర్శించినట్లుగా వీడియోల్లో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత యువ బ్యాట్స్‌మెన్ సక్సేనా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మొదటి ఓవర్ ఆడిన యశస్వి జైశ్వాల్ డిఫెన్స్ ఆడి మెయిడిన్ ఓవర్ చేసాడు. అయితే వికెట్‌ పడకపోవడంతో బంగ్లా బౌలర్లు అసహనానికి గురయ్యారు.

Here's Video

ఇక ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ను బంగ్లా ఫాస్ట్‌ బౌలర్‌ తన్జీమ్‌ హసన్‌ వేస్తున్నాడు. భారత బ్యాట్స్‌మన్‌ దివ్యాన్ష్‌ సక్సేనా స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. పేసర్ హసన్‌ వేసిన రెండో ఓవర్ మూడో బంతిని సక్సేనా డిఫెండ్‌ చేశాడు. తనవైపే వచ్చిన బంతిని అందుకున్న హసన్‌ వెంటనే సక్సేనా మీదకి విసిరాడు. తలకు దగ్గరగా వచ్చిన ఆ బంతి నుంచి సక్సేనా తప్పించుకున్నాడు. తనవైపు వస్తున్న బంతిని సక్సేనా గమనించి తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.

దీంతో హసన్‌, సక్సేనా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫీల్డ్‌ అంపైర్‌ కలుగజేసుకొని గొడవను సద్దుమణిచాడు. ఆ తర్వాత అంపైర్ బౌలర్‌ను పిలిచి మందలించాడు. బంతి నుండి సక్సేనా తప్పించుకోకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తరువాత బంగ్లా బేబీలు మరోసారి తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇండియా యువ ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు.

స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) తన్జీద్‌ (బి) షరీఫుల్‌ 88; దివ్యాంశ్‌ సక్సేనా (సి) మహ్ముదుల్‌ (బి) అవిషేక్‌ దాస్‌ 2; తిలక్‌వర్మ (సి) షరీఫుల్‌ (బి) షకీబ్‌ 38; ప్రియమ్‌ గార్గ్‌ (సి) తన్జీద్‌ (బి) రకీబుల్‌ 7; ధ్రువ్‌ జురెల్‌ (రనౌట్‌) 22; సిద్ధేశ్‌ వీర్‌ ఎల్బీడబ్ల్యూ (బి) షరీఫుల్‌ 0; అథర్వ అంకోలేకర్‌ (బి) అవిషేక్‌ దాస్‌ 3; రవి బిష్ణోయ్‌ (రనౌట్‌) 2; సుశాంత్‌ (సి) షరీఫుల్‌ (బి) షకీబ్‌ 3; కార్తీక్‌ త్యాగి (సి) అక్బర్‌ అలీ (బి) అవిషేక్‌ దాస్‌ 0; ఆకాశ్‌ సింగ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్‌) 177.

వికెట్ల పతనం: 1–9, 2–103, 3–114, 4–156, 5–156, 6–168, 7–170, 8–170, 9–172, 10–177. బౌలింగ్‌: షరీఫుల్‌ 10–1–31–2, తన్జీమ్‌ షకీబ్‌ 8.2–2–28–2, అవిషేక్‌ దాస్‌ 9–0–40–3, షమీమ్‌ 6–0–36–0, రకీబుల్‌ 10–1–29–1, తౌహిద్‌ 4–0–12–0

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: పర్వేజ్‌ (సి) ఆకాశ్‌ (బి) యశస్వి 47; తన్జీద్‌ (సి) కార్తీక్‌ త్యాగి (బి) రవి బిష్ణోయ్‌ 17; మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 8; తౌహిద్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రవి బిష్ణోయ్‌ 0; షహదత్‌ (స్టంప్డ్‌) జురెల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 1; అక్బర్‌ అలీ (నాటౌట్‌) 43; షమీమ్‌ (సి) యశస్వి (బి) సుశాంత్‌ మిశ్రా 7; అవిషేక్‌ దాస్‌ (సి) కార్తీక్‌ త్యాగి (బి) సుశాంత్‌ మిశ్రా 5; రకీబుల్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (42.1 ఓవర్లలో 7 వికెట్లకు) 170.

వికెట్ల పతనం: 1–50, 2–62, 3–62, 4–65, 5–85, 6–102, 7–143 బౌలింగ్‌: కార్తీక్‌ త్యాగి 10–2–33–0, సుశాంత్‌ మిశ్రా 7–0–25–2, ఆకాశ్‌ సింగ్‌ 8–1–33–0, రవి బిష్ణోయ్‌ 10–3–30–4, అథర్వ 4.1–0–22–0, యశస్వి జైస్వాల్‌ 3–0–15–1.