U-19 World Cup Final: ఎవరు గెలిచినా రికార్డుల మోతే, భారత్ గెలిస్తే 5వ ప్రపంచకప్ మన చేతుల్లో, తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన బంగ్లా, చరిత్ర తిరగ రాసేందుకు అడుగుదూరంలో..
U19 finalists India and Bangladesh (Photo Credits: @ICC)

Potchefstroom, Febuary 9: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ( U-19 World Cup Final) చేరిన యువ భారత జట్టు (India) ఆదివారం బ్లంగాదేశ్‌తో (Bangladesh) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 16 యువ జట్లు పాల్గొన్న అండర్‌–19 ప్రపంచ కప్‌ (ICC U19 Cricket World Cup 2020) తుది సమరం మరో కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.

నేడు జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌తో తొలిసారి ఫైనల్‌ చేరిన బంగ్లాదేశ్‌ తలపడనుంది. తమ టైటిల్‌ నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా, ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్‌ పట్టుదలగా ఉంది.

ఇదిలా ఉంటే ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్‌ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్‌ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇప్పటికే పలువురు ఇండియా టీమ్ గెలవాలంటూ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. క్రికెట్ లెజెండ్ సచిన్ ట్విట్టర్లో ఆల్ ది బెస్ట్ జూనియర్స్ అంటూ ట్వీట్ చేశారు.

Here's Sachin Tendulkar Tweet

యువ భారత్‌కు ఇది ఏడో ఫైనల్‌ కాగా.. బంగ్లా తుదిపోరుకు చేరడం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా ఐసీసీ మెగా టోర్నీల్లో బంగ్లా జట్టు ఫైనల్‌కు చేరడం కూడా ఇదే ప్రథమం. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పెద్దగా పోటీ లేకుండానే ఇక్కడి వరకు వచ్చిన యువ భారత జట్టుకు ఫైనల్లో అసలు సిసలు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. జూనియర్‌ లెవల్లో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ చక్కటి ప్రదర్శన కనబరుస్తుండటంతో.. ప్రియం గార్గ్‌ సేన అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉంది.

2018 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు క్వార్టర్‌ ఫైనల్లో తలపడ్డాయి. నాడు భారత్‌ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత ప్రపంచ కప్‌ తర్వాత భారత్, బంగ్లాదేశ్‌ జట్లు అండర్‌–19 విభాగంలో 7 సార్లు తలపడ్డాయి. ఇందులో 2 మ్యాచ్‌లు వర్షంతో రద్దు కాగా... మిగిలిన ఐదు మ్యాచ్‌లలో 4 గెలిచిన భారత్‌ 4–1తో ఆధిక్యంలో ఉంది. 2018 ఆసియా కప్‌ సెమీఫైనల్లో, 2019 ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌నే విజయం వరించింది. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన పోరులో బంగ్లాదేశ్‌ 2 వికెట్లతో భారత్‌ను ఓడించింది.

మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశంలో అదరగొడుతున్న యువ భారత్‌ మరో విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌ మన ఒడిలో చేరనుంది.అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా మెగాటోర్నీలో అడుగుపెట్టిన బంగ్లా.. ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఆటతీరుతో చరిత్ర తిరగరాసేందుకు అడుగు దూరంలో నిలిచింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: ప్రియం (కెప్టెన్‌), యశస్వి, దివ్యాన్ష్‌, తిలక్‌ వర్మ, ధృవ్‌, సిద్ధేశ్‌, అథర్వ, రవి, సుశాంత్‌, కార్తీక్‌, ఆకాశ్‌.

బంగ్లాదేశ్‌: అక్బర్‌ (కెప్టెన్‌), పర్వేజ్‌, తన్జిద్‌, మహ్ముదల్‌, తౌహిద్‌, షహాదత్‌, షమీమ్‌, రకీబుల్‌, షరీఫుల్‌, తన్జీమ్‌, మురాద్‌.