Team India Head Coach: బీసీసీఐ కీలక నిర్ణయం.. రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్??
ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రావిడ్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచింగ్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
Newdelhi, Jan 3: టీమిండియా (Team India) ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పదవీ కాలంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రావిడ్ పదవీ కాలాన్ని పొడిగించకూడదని, అతడి స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు(VVS Laxman) కోచింగ్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కేన్సర్లతో పోరాడతానన్న మార్టినా.. గొంతు, రొమ్ము కేన్సర్ బారినపడిన టెన్సిస్ దిగ్గజం
భారత జట్టు గతేడాది ప్రదర్శనపై ఈ నెల 1న ముంబైలో బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమీక్ష సమావేశం సందర్భంగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి రోడ్ మ్యాప్‌పై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది నవంబరులో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీని తర్వాత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత అతడి పదవీకాలాన్ని పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆ స్థానాన్ని వీవీఎస్ లక్ష్మణ్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
జూనియర్ జట్టు కోచ్‌గా ద్రావిడ్ అద్వితీయ విజయాలు అందుకున్నాడు. అయితే, సీనియర్ జట్టుకు మాత్రం విజయాలు అందించడంలో విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఐసీసీ మేజర్ టోర్నీలలో భారత్ బొక్కబోర్లా పడింది. ద్రావిడ్ స్థానాన్ని లక్ష్మణ్‌తో భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది. లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు కొత్తేమీ కాదు. రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో భారత జట్టుకు ఇన్‌చార్జ్ కోచ్‌గా వ్యవహరించాడు.