రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి (Rishabh Pant Health Update) నిలకడగా ఉందని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం రిషబ్ (Cricketer Rishabh Pant) డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే, ఇన్‌ఫెక్షన్ సోకుతుందన్న భయంతో పంత్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పంత్‌కు ఇన్‌ఫెక్షన్ (infection fear) సోకుతుందన్న భయంతో అతన్ని ప్రత్యేక గది (Private Suite)కి మార్చాల్సిందిగా.. అతని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందికి చెప్పాం. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలో కోలుకుంటాడు’ అని శర్మ వెల్లడించారు.
పంత్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ దామి ఆదివారం పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం పంత్ వైద్యానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. కాగా రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది.
ప్రమాదం తర్వాత కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.