IPL Auction 2025 Live

World Cup 2023: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో భారత్, ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా

ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించండం ద్వారా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

Credit@ BCCI twitter

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్రను కొనసాగించింది. గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌ను ఓడించే జట్టే రాలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో గెలిచి అపజయమే లేని జట్టుగా నిలిచింది.ఈ సందర్భంగా పలు రికార్డులను నమోదు చేసింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించండం ద్వారా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

అయితే గతంలో శ్రీలంక(1996), ఆస్ట్రేలియా(2003) కూడా వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచినప్పటికీ అది రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో కాదు. అప్పుడు ప్రపంచకప్ పోటీలను గ్రూపులుగా విభజించి ఆడించారు. దీంతో మొత్తం 10 జట్లు కలిసి ఆడిన లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇక ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉంది. 2003, 2007 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచింది.

చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా దీపావళి, వరుసగా తొమ్మిదో విక్టరీ కొట్టిన టీమిండియా, వరల్డ్ కప్‌లో కొనసాగుతున్న రోహిత్ సేన జోరు, నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఘనవిజయం

ఆదివారం నెదర్లాండ్స్‌పై గ్రాండ్‌ విక్టరీతో మరో రికార్డును భారత్‌ 31 ఏళ్ల అనంతరం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించి, వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేశాడు. వరల్డ్‌కప్‌ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించారు.

1987 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఇలా జరిగింది. నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్‌ చేయించింది. అనంతరం 1992 వరల్డ్‌కప్‌లో రెండోసారి ఇలా జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది.

తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన విరాట్‌ కోహ్లీ, వైరల్‌ అవుతున్న అనుష్క శర్మ సెలబ్రేషన్స్‌

తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంతో వరల్డ్‌కప్‌ చరిత్రలో 31 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా, విరాట్‌, రోహిత్‌, షమీ, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బౌలింగ్‌ చేయగా.. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా తలో 2 వికెట్లు, విరాట్‌, రోహిత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. షమీ, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లకు వికెట్‌ దక్కలేదు.

ఇక ఈ మ్యాచ్‌లో నమోదైన మరికొన్ని రికార్డులు..

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ సాధించిన అత్యధిక వన్డే విజయాలు : 24 (2023), 24 (1998), 22 (2013)

ఒక ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లలో ఆస్ట్రేలియా తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. ఆసీస్‌ 2003, 2007లో వరుసగా 11 విజయాలు నమోదు చేయగా.. ఈ మెగాటోర్నీలో భారత్‌ 9 విజయాలను నమోదు చేసింది.

ఈ టోర్నీలో రవీంద్ర జడేజా ఇప్పటి వరకూ మొత్తం 16 వికెట్లు తీశాడు. ఒక వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా అనిల్‌ కుంబ్లే(15) రికార్డును అధిగమించాడు.

ఒక క్యాలండర్‌ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా భారత్‌(215) నిలిచింది.

వన్డే ప్రపంచకప్‌లోనే భారత్‌ తరఫున వేగవంతమైన (62 బంతుల్లో) శతకం బాదిన బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డు.