FIR Filed against Yuvraj: యువరాజ్‌ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, యజువేంద్ర చహల్‌ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు, ఇప్పటికే క్షమాపణ కోరిన యువీ

గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో సందర్భంగా యువరాజ్‌ సింగ్‌.. మరో క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ (Yuzvendra Chahal) కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని హరియాణాకు చెందిన ఓ లాయర్‌ హిస్సార్‌ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌పై పిర్యాదు చేశారు

Yuvraj Singh (Photo Credits: Getty Images)

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో సందర్భంగా యువరాజ్‌ సింగ్‌.. మరో క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ (Yuzvendra Chahal) కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని హరియాణాకు చెందిన ఓ లాయర్‌ హిస్సార్‌ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌పై పిర్యాదు చేశారు. ఆయనపై భారతీయ శిక్షాస్మృతిలోని 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) ఎస్) కింద కేసు నమోదు చేసినట్లు (FIR Filed against Yuvraj Singh) అధికారులు వెల్లడించారు.

ఘటన వివరాల్లోకెళితే.. గత సంవత్సరం జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ ఆన్‌లైన్ లైవ్ సెషన్‌లో (Live Session in 2020) యువరాజ్ సింగ్ పాల్గొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో సందర్భంగా తోటి ఆటగాడైన ‌ యజువేంద్ర చహల్‌ను ఉద్దేశించి.. సామాజిక వర్గాన్ని ప్రసావిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత యువరాజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లోనే ట్వీట్‌ చేశారు.

ఉత్తరాఖండ్ జల విలయం, మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించిన పంత్, ఈ మొత్తాన్ని అక్కడి సహాయ చర్యల కొరకు అందిస్తానంటూ ట్వీట్

అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని, నిమ్న కులాలను లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై లాక్‌డౌన్‌ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు.. ప్రస్తుతం యువరాజ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం గమనార్హం. త్వరలోనే యువరాజ్‌కు నోటీసులు పంపి ఆయనను విచారిస్తామని ఓ అధికారి వెల్లడించారు.