FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్‌లో బెల్జియంను చిత్తు చేసిన మొరాకో.. అల్లర్లకు దారితీసిన ఘటన.. వీడియోతో..
మొరాకో జట్టు బెల్జియంను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే, ఈ విజయం బ్రసెల్స్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది.
Brussels, Nov 27: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) లో మరో సంచలనం నమోదైంది. మొరాకో (Morocco) జట్టు బెల్జియంను (Belgium) 2-0తో చిత్తుగా ఓడించింది. అల్ థుమమ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో 22వ ర్యాంక్‌లో ఉన్న మొరాకో, రెండో ర్యాంక్‌లో ఉన్న బెల్జియంను మట్టికరిపించింది. మొరాకో మిడ్ ఫీల్డర్ అబ్దెల్‌హమిద్ సబిరి 73వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా తొలి గోల్ అందించాడు. జకారియ అబౌఖ్లాల్ రెండో గోల్ కొట్టడంతో 2-0తో మొరాకో సంచలన విజయం నమోదు చేసింది.
అయితే, ఈ విజయం బ్రసెల్స్ (Brussels) లో ఉద్రిక్తతలకు దారి తీసింది. బెల్జియంలో దాదాపు 5 లక్షల మంది మొరాకో వాసులు నివసిస్తున్నారు. మొరాకో చేతిలో బెల్జియం ఓటమి పాలయ్యాక.. మొరాకో జెండా కప్పుకున్న పలువురు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. మొరాకో గెలుపును జీర్ణించుకోలేని కొందరు వాహనాలపై రాళ్లు రువ్వారు. మరికొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు అల్లరిమూకలను (Riots) చెదరగొట్టారు. జల ఫిరంగులను ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.