CM Jagan PRC Review Highlights: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్ వరాల జల్లు, ఉద్యోగులకు సంక్రాంతి కానుక, పాలనపై బిగిసిన మరింత పట్టు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ 23.25 శాతం ఫిట్‌మెంట్ ను ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నాడు సీఎం జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని జగన్ ప్రకటించారు.
విజయవాడ, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ 23.25 శాతం ఫిట్‌మెంట్ ను ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నాడు సీఎం జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని జగన్ ప్రకటించారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం Ys Jagan భేటీ అయ్యారు.ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం జగన్ ఆర్ధిక శాఖాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు. నిన్ననే ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అభిప్రాయాలను సీఎం నోట్ చేసుకొన్నారు. ఇవాళ మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి Prc ఫిట్‌మెంట్ 23.29 శాతం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఏపీలో ఉద్యోగుల Retirement వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ ఏడాది జూన్ 30 లోపుగా కారుణ్య నియామకాలను చేపడుతామని సీఎం హామీ ఇచ్చారు. పెంచిన జీతాలను ఈ నెల నుండి అమల్లోకి వస్తాయని సీఎం హామీ ఇచ్చారు.2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు చేస్తామని కూడా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా సీఎం జగన్ చెప్పారు. రెండు వారాల్లో employees సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ జూన్ 30 లోపుగా ప్రోబేషణ్ కన్‌ఫర్మేషన్ ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జూలై నుంచి రెగ్యులర్ పే స్కేల్ కూడా అందిస్తామని ప్రకటించింది.స్వంత ఇల్లు ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్వామర్ట్ టౌన్ షిప్ లో ఎంఐజీ లేఔట్లలో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలను గురువారం నాటి సమావేశంలో కోరారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నానని సీఎం తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు 45 నుండి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ సమావేశంలో కోరినట్టుగా సమాచారం. అయితే 23.29 శాతం ఫిట్‌మెంట్ కి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి.
పెండింగ్ డిఎలను కూడా ఒకేసారి ఇచ్చేందుకు సీఎం ప్రకటన చేయడంతో 23.29 శాతం ఫిట్‌మెంట్ కి ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపాయి.అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్టుగా కాకుండా ఆర్ధిక శాఖ అధికారులు ప్రతిపాదించినట్టుగా కాకుండా మధ్య మార్గంగా ఫిట్‌మెంట్ ను జగన్ ప్రతిపాదించారు.ఈ మేరకు నిన్నటి నుండి కసరత్తు చేశారు. ఇవాళ ఉద్యోగ సంఘాల సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ను జగన్ ప్రతిపాదించారు.నెల రోజులుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని అంశం ఇవాళ్టితో కొలికి వచ్చింది. ఉద్యోగ సంఘాలు తొలుత డిమాండ్ చేసినట్టుగా కాకుండా కొంత పీఆర్సీ ఫిట్‌మెంట్ తగ్గినా ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి.
CM Jagan Review Highlights ఇవే...
>> నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను.
>> రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒమిక్రాన్ ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని, నిన్ననే చెప్పడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపాను. నిన్న ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.
>> చీఫ్ సెక్రటరీ గారి కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం కంటే, 14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు పలుదఫాలుగా చెప్పారు. మన ఆకాంక్షలు కూడా కాస్త తగ్గాలని కోరాను. అదే సమయంలో ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎస్‌కి, ఆర్థికశాఖ కార్యదర్శికి చాలా సుదీర్ఘంగా చెప్పాను.
>> నేను వారికి ఒకటే చెప్పాను. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం, సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యం. అది లేకపోతే సాధ్యంకాదు. మా కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని అందర్నీ భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం. ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావనకూడా.
>> నిన్న పీఆర్సీతో కూడా కొన్ని కొన్ని అంశాలు మీరు లేవనెత్తారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా సీఎస్‌తో, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడాను. స్పష్టమైన టైమ్‌లైన్స్‌పైన కూడా మాట్లాడాను.
>> కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరి సమక్షంలో సీఎస్‌గారికి మళ్లీ చెప్తున్నాను.
>> ఈహెచ్‌ఎస్ – ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చాను. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వస్తుంది.
>> సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుంది.
>> సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబరు నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పినప్పటికీ, మీ అందరి ప్రభుత్వంగా, 2020 ఏప్రిల్ నుంచే, అంటే 21 నెలల ముందునుంచే మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించాం.
>> కేంద్రం ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికను తీసుకుని, డైవర్స్ క్రైటీరియా తీసుకుని సైంటిఫిక్ పద్ధతుల్లో ఒక వ్యక్తికాకుండా, ఏకంగా కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా సెంట్రల్ పే రివిజన్ కమిషన్ ప్రతిపాదనలనే యథాతథంగా తీసుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక నుంచి ఈ పద్ధతిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
>> గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు)ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను.
>> ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాను.
>> నిన్నమీతో చెప్పిన విధంగా, పీఆర్సీ అమలు చేసేనాటికి పెండింగ్ డీఏలు ఉండకూడదని స్పష్టంగా చెప్పినమీదట, పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించాను.
>> సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబరు నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే జనవరి 1, 2022 నుంచే, అంటే ఈనెల నుంచే పీఆర్సీని అమలు చేసి, దాని ప్రకారం జీతాలు ఈనెలనుంచే ఇవ్వాలని ఆదేశించాను.
>> కొత్త స్కేల్స్‌ను, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి 1 నుంచే, జనవరి జీతాలతోనే అమలు చేయాలని నిర్ణయించాం.
>> ఇక ఫిట్‌మెంట్ విషయానికొస్తే.. సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్‌మెంట్ ఇవ్వలేమని. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్నికోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించాం. అధికారుల కమిటీ చెప్పిన 14.29శాతం కన్నా దాదాపు 9శాతం పెంచి ఫిట్‌మెంట్ ఇస్తున్నామని ఉద్యోగ సోదరులకు సవినయంగా అర్థం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను.
>> ఈ పీఆర్సీ అమలు 01–07–2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ అమలు 01–04–2020 నుంచి, కొత్త జీతాలు 01–01–2022 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ. 10,247 కోట్లు రాష్ట్ర ప్రభుతానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను.
>> చివరగా మరో ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తున్నాను. ప్రభుత్వోద్యోగులు అనే కన్నా మంచి చేయడానికి ఎల్లవేలలా ఉద్యోగులకు తోడుగా ఉంటూ, మీ అందరికీ భరోసా ఇస్తూ...మీరంతా సుదీర్ఘ కాలం ప్రజా సేవలో జీవితం గడపిన వ్యక్తులు. మీకు ఇంకా మంచి చేయడానికి, మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, అన్నిరకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మీ సేవలన్ని మనం మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో... వారి రిటైర్‌మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నాం అని... 1.1.2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలియజేస్తున్నాను.
>> సీపీఎస్‌కు కూడా సంబంధించి టైంలైన్ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌సబ్‌కెమిటీ వేశాం. జూన్ 30లోగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించే ఈ నిర్ణయాలు ప్రకటిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించటంలో ఉద్యోగుల సహాయ సహకారాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం జగన్ పేర్కొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)