New Liquor Policy in AP: ఏపీలో ముగిసిన మద్యం లాటరీ ప్రక్రియ, లిక్కర్ షాపులను దక్కించుకున్న మహిళలు, అక్టోబర్ 16 నుంచి కొత్త షాప్‌లో మద్యం అమ్మకాలు

26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797. 64 కోట్ల ఆదాయం సమకూరింది

Allotment of liquor shops in Andhra Pradesh Closed, Licenses to be given to successful bidders tomorrow (Photo-Video Grab)

Vjy, Oct 14: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797. 64 కోట్ల ఆదాయం సమకూరింది.ఉద్రిక్తతలు తలెత్తకుండా లాటరీ కేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.100 మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఇక విజయవంతమైన బిడ్డర్లకు రేపు లైసెన్స్‌లు ఇవ్వబడతాయి.

ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానం మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి అయింది. కాగా డ్రాలో మద్యం షాప్ లైసెన్స్ (దుకాణం) దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. దీంతో డ్రాలో షాపులు వచ్చిన వారు ప్రస్తుతం నగదు సమీకరణ పనిలో పడ్డారు. గత ప్రభుత్వం పాత మద్యం పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ(Private policy)నీ తీసుకొచ్చింది. కాగా ఈ రోజు లక్కీ డ్రాలో షాప్ లు వచ్చిన వారు. 16 నుంచి కొత్త షాప్ లో అమ్మకాలు జరుపుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??

అనంతపురం జిల్లాలో మద్యం టెండర్లలో బీజేపీ నేతల హవా సాగింది. ధర్మవరంలో ఐదు మద్యం షాపులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ దక్కించుకున్నారు.ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పగా, చింతమనేని అనుచరులు దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. చలసాని గార్డెన్‌లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ జరిగింది.

తిరుపతి శిల్పారామంలో లాటరీ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. జిల్లాలో 227 షాపులకు 3,915 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి అందిన రూ.78.30 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుపతి అర్బన్‌లో 32 షాపులకు రికార్డు స్థాయిలో 985 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపునకు విడి విడిగా లాటరీ తీశారు. లాటరీ పొందిన వారి వివరాలు స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాటు చేశారు.

Allotment of liquor shops in Andhra Pradesh Closed

గుంటూరులో.. వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ లో లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి షాపును వ్యాపారి మల్లిశెట్టి సుబ్బారావు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 127 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక నరసరావుపేట టౌన్ హాల్లో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ మొదలైంది. జిల్లాలో 129 మద్యం షాపులకు లాటరీ తీశారు. జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 2,639 దరఖాస్తులు వచ్చాయి.

ఏలూరులో... కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ షురూ అయింది. జిల్లా వ్యాప్తంగా 144 మద్యం షాపులకు గాను 5,499 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలో కూడా మద్యం షాపుల కోసం లాటరీ నిర్వహించారు అధికారులు. ఇక్కడ జరిగిన లాటరీ పద్దతి ఎంపికలో ఏకంగా 16 మద్యం షాపులను మహిళలు దక్కించుకోవడం విశేషం. అంతేకాదు కృష్ణా జిల్లాలో ఏడు మద్యం షాపులను కూడా మహిళలే దక్కించుకున్నారు.

గత ప్రభుత్వం మద్యం విధానాన్ని భ్రష్టుపట్టించిందని ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తయారీ నుంచి విక్రయాల వరకు అన్నీ ప్రభుత్వ అధీనంలోనే పెట్టుకున్నారని అన్నారు. సొంత బ్రాండ్లను ప్రమోట్‌ చేసుకొని దోపిడీ చేశారని దుయ్యబట్టారు. తాజాగా మద్యం విధానాలపై సబ్‌కమిటీ అధ్యయనం చేసి, తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇచ్చేలా విధానం రూపొందించిందని అన్నారు. అన్ని మద్యం బ్రాండ్లను ప్రమోట్‌ చేసుకోవాలని చెప్పారు.

‘‘ప్రభుత్వంపై నమ్మకంతోనే మద్యం దుకాణాల కేటాయింపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. గుడికి, బడికి 100 మీటర్ల పరిథిలో మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ దుకాణాలను మూసివేయిస్తాం. గత ప్రభుత్వంతో పోలిస్తే పోలీస్‌ వ్యవస్థ పటిష్ఠంగా తయారైంది. బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే తీవ్ర చర్యలుంటాయి’’ అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

ప్రభుత్వం తాజాగా భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైనా ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధర రూ 150.50 గా ఉంటే..ఆ దానిని రూ 160 వసూలు చేయనున్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుంది.

అయితే, క్వార్టర్ మద్యం ధర రూ 99 గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో, రూ 100 ధరగా ఉంటే అందులో రూపాయిని మినహాయించి రూ 99కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం దుకాణాల టెండర్లకు ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 89,643 వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif