Oxygen Shortage in Kurnool: కర్నూలులో దారుణం, ఆక్సిజన్ అందక అయిదుగురు కరోనా పేషెంట్లు మృతి, అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ, సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం
కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఅయిదుగురు కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి ( 5 COVID-19 patients died due to oxygen shortage) చెందారు. ఈ సంఘటనపై ఏపీ ప్రభుత్వం (AP Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Kurnool, May 1: కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. కేఎస్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఅయిదుగురు కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి ( 5 COVID-19 patients died due to oxygen shortage) చెందారు. ఈ సంఘటనపై ఏపీ ప్రభుత్వం (AP Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంపై మండిపడింది. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు కర్నూలు కలెక్టర్ (Kurnool Collector) తెలిపారు. కర్నూలులోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు అనుమతి లేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారని కలెక్టర్ నిర్థారణకు వచ్చారు. కేఎస్ కేర్ ఆస్పత్రిలో కోవిడ్ వైద్యానికి అనుమతి లేదు కలెక్టర్ స్పష్టం చేశారు. ఘటనపై డీఎంహెచ్‌ఓ విచారణ చేస్తున్నారు.
కోవిడ్ ఆస్పత్రిగా (Covid Hospital) నోటిఫైడ్ చేయని కేఎస్కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయారనితెలుసుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. కేఎస్‌కేర్ ఆస్పత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్‌లో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్‌ను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశారు. అయితే పోలీసులు వెళ్లేసరికి ఆస్పత్రి సిబ్బంది పరారయినట్లు తెలుస్తోంది.
మొదట్లో కేవలం ఐసోలేషన్‌లో ఉన్న వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా చికిత్సకు ఎలాంటి అనుమతులు లేకున్నా, ఈ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆస్పత్రి ఎండీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Here's Superintendent of Police,Kurnool dt AP Tweet
డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వం/జిల్లా యంత్రాంగం అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్ ఆస్పత్రులు లేదా కోవిడ్ కేర్ సెంటర్స్ నడిపితే క్రిమినల్ కేస్ పెడతాం... సీజ్ చేయిస్తామని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు.