New Delhi, May 1: దేశ రాజధానిలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా డిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో (Batra Hospital Faces Oxygen Shortage) తీరని విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ లేకపోవడంవల్ల ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు (8 COVID-19 Patients Die Due to Lack of Life-Saving Gas) కోల్పోయారు. వీరిలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఆర్.కె. హిమాథని కూడా ఉన్నారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో 5గురి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. ఢిల్లీలో బాత్రా ఆసుపత్రిలో (Batra Hospital) కొంతకాలం ఆక్సిజన్ అయిపోవడంతో ఎనిమిది మంది రోగులు మరణించారని ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ శనివారం తెలిపింది. ఆక్సిజన్ కొరతతో మరణించిన వారిలో డాక్టర్లలో ఒకరు ఉన్నారని ఆసుపత్రి ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
కాగా దేశ రాజధానిలో ఆక్సిజన్ సంక్షోభంపై వరుసగా 11వ రోజు ఢిల్లీ హైకోర్టుకులో విచారణ జరిగింది. తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలు అయిపోతున్నాయని తక్షణమే స్పందించాలని వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు వేడుకుంటున్నాయి. అంతకుముందు బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధాన్షు తాము ఆక్సిజన్ సంక్షోభంలో ఉన్నామనీ, రాబోయే 10 నిమిషాల్లో పూర్తిగా అయిపోతుందని, ఆదుకోవాలంటూ ఒక వీడియోను విడుదల చేయడం గమనార్హం.
కానీ అధికారులు తేరుకుని ఆక్సిజన్ రీ సప్లై ట్యాంకర్ చేరుకునేసరికే అనర్థం జరిగిపోయింది. అంతా అయిపోయిన 45 నిమిషాల తరువాత ట్యాంకర్ చేరుకుందని, అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని పెద్ద ఆసుపత్రులు కరోనా పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది.