Explosion in Bhimavaram: సీఎం జగన్ పర్యటన..భీమవరంలో భారీ పేలుడు, కలవరపడిన పోలీస్, అధికార యంత్రాంగాలు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి హాజరయిన ఏపీ సీఎం
ఉండి రోడ్డులోని జంట కాలువల సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు బాంబుతో సంభవించిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
Amaravati, August 14: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి పేలుడు (Explosion in Bhimavaram) సంభవించింది. ఉండి రోడ్డులోని జంట కాలువల సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు బాంబుతో సంభవించిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం భీమవరంలో పర్యటించనుండగా.. పేలుడు (A huge explosion took place in Bhimavaram) సంభవించడంతో పోలీస్, అధికార యంత్రాంగాలు కలవరపడ్డాయి.
సీఎం పర్యటన కోసం వచ్చిన బాంబ్ స్క్వా డ్ పేలుడు సంభవించిన ప్రాంతంలో అణువణువు తనిఖీ చేసింది. సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన బాంబు పేలుడు వల్ల సంభవించలేదని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. పాత ఫ్రిజ్‌లోని గ్యాస్ సిలిండర్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ఏదైనా బ్యాటరీ వల్ల గాని పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. నిపుణులు పరీక్షల అనంతరమే దీనికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు.
పెట్రోల్ బంక్ పక్కన ఎంతోకాలంగా పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు. షాపు వెనుక ఖాళీ ప్రదేశంలో పాత ఇనుప సామగ్రిని నిల్వ చేస్తుంటారు. అదే ప్రాంతంలో పచ్చిక ఉండటంతో నిత్యం ఆవులు మేత కోసం అక్కడికి వస్తుంటాయి. శుక్రవారం రాత్రి ఆవులు పచ్చగడ్డి మేస్తుండగా ఒక ఆవు గుర్తుతెలియని వస్తువుపై కాలువేయడంతో పేలుడు సంభవిం చింది. పేలుడు ధాటికి ఆవు వెనుక కాలు పూర్తిగా దెబ్బతినగా.. పొట్టభాగంలో తీవ్ర గాయమై కదలలేని స్థితిలో పడిపోయింది. పేలుడు శబ్దం చాలాదూరం వినిపించినట్టు చెబుతున్నారు.
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో (CM YS Jagan Bhimavaram Tour) పర్యటించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ కె శ్రీధర్, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.