AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..
ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.
Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత గ్రంధంగా భావించారని బుగ్గన తెలిపారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి బుగ్గన తెలిపారు.విభజన ఏర్పడిన అనంతరం ప్రతికూల పరిస్థితుల్లో కూడా పుంజుకుందని తెలిపారు.
సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు.
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు... పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం అని నినదించారు. పంట బీమా, ఇన్ పుట్ సబ్సిడీని మర్చిపోయిన ప్రభుత్వం అని నినాదాలు చేశారు. దగా ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అని నినదించారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ వారిస్తున్నా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు.
దీంతో, ఈరోజుకి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే, సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. టీడీపీ సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళ పరిస్థితిలోనే స్పీకర్ జీరో అవర్ ను ప్రారంభించారు. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బెందళం అశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, వెంకటరెడ్డి నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. టీడీపీ సభ్యులు నిన్న కూడా సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.
సమావేశాలకు ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024–25 ఆర్ధిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడంతో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది.
నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ హార్టీకల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది.
దీంతో పాటు డోన్‌లో వ్యవసాయం రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీ పనిచేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు కేబినెట్ అనుమతిచ్చింది.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.