IPL Auction 2025 Live

AP Disha Act 2019: మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే, 21 రోజుల్లోనే తీర్పు, హైదరాబాద్ దిశ హత్యాచారం ఉదంతంతో ఏపీ సీఎం జగన్ నిర్ణయం, ఏపీ దిశ యాక్ట్ -2019కు ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదం

మహిళలపై అత్యాచారం, ఇతర లైంగిక దాడులు, హత్య, యాసిడ్ దాడులు, వేధింపులు, సామాజిక మాధ్యమాలలో వేధింపులు, చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలకు సంబంధించి వేధింపుల కేసులన్నీ ఈ ఏపీ దిశ యాక్ట్ కింద విచారణ చేయబడతాయి.....

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Amaravathi, December 12: మహిళల పట్ల అత్యాచారాలు, ఇతర క్రూరమైన లైంగిక నేరాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet) బుధవారం ఆమోదం తెలిపింది. నేరానికి తగిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం -2019 దీనినే ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ -2019 చట్టం (AP Disha Act 2019) తేవాలని సీఎం జగన్మోహన రెడ్డి (CM Jagan) బుధవారం జరిగిన కేబినేట్ మీటింగ్ లో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఈ నూతన ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ -2019 చట్టం ప్రకారం నేరం జరిగిన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తిచేస్తారు, 14 రోజుల్లో విచారణ పూర్తవుతుంది. ఇక నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు వెలువరించాలి. ప్రస్తుతం ఇలాంటి నేరాలకు విచారణ గడువు 4 నెలలుగా ఉంది. ఇప్పుడు ఏపీ దిశ యాక్ట్ 2019 అమలులోకి వస్తే 21 రోజుల్లోనే న్యాయ ప్రక్రియ పూర్తయి, శిక్షలు ఖరారు చేయాల్సి ఉంటుంది.

మహిళలపై అత్యాచారం, ఇతర లైంగిక దాడులు, హత్య, యాసిడ్ దాడులు, వేధింపులు, సామాజిక మాధ్యమాలలో వేధింపులు, చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలకు సంబంధించి వేధింపుల కేసులన్నీ ఈ ఏపీ దిశ యాక్ట్ కింద విచారణ చేయబడతాయి.  దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ - సీఎం జగన్

ఏపీ డైరెక్టివ్ యాక్ట్‌తో పాటు, పిల్లల రక్షణ కోసం భారత శిక్షాస్మృతిలోని POSCO సెక్షన్లు 354 (ఇ) మరియు 354 (ఎఫ్) లను కలిగి ఉన్న ముసాయిదా బిల్లులకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గత నెల నవంబర్ 27న హైదరాబాదులో జరిగిన యువ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం ఘటన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలపై నేరాలను అరికట్టే దిశగా, చనిపోయిన 'దిశ' పేరు మీదుగానే ఈ కొత్త సవరణ చట్టానికి రూపకల్పన చేశారు,  ఇదే విషయంపై  సీఎం అసెంబ్లీలో ప్రస్తావించారు కూడా. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తే చట్ట రూపం లభిస్తుంది.