AP Assembly Session Highlights (photo-PTI)

Amaravathi, December 9: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Assembly Session) రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేతలు ఉల్లి ధరల (Onion Price)పై చర్చించాలని పట్టుబట్టారు. కాగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ (TDP) నుంచి 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీతో సహా 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పయ్యావుల, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, వాసుపల్లి గణేష్ అసెంబ్లీకి రాలేదు.

అయితే, అందులో బాలకృష్ణ, పయ్యావుల, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పయ్యావుల అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. ఇక మాజీ మంత్రి మంత్రి గంటా..ఆయన సహచరుడు వాసుపల్లి గణేష్ ఎందుకు సమావేశాలకు రాలేదు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కాగా పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను మాత్రం ఆయన ఇప్పటికే ఖండించిన సంగతి విదితమే. ఎవరేమన్నారో వారి మాటల్లో ఓ సారి చూద్దాం.

ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)

నాకు ఒక్కతే భార్య ఇద్దరు ఆడపిల్లలు..ఒక చెల్లె..ఉన్నారన్న ఏపీ సీఎం కొంతమంది నాయకులకు ముగ్గురు, నలుగురు భార్యలున్నా సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన(Disha rape murder) ఏపీ రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి ? ఇక్కడి పోలీసులు ఎలా వ్యవహరించాలి ? మనకు మనం ప్రశ్నించుకోవాలన్నారు.

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలని సీఎం జగన్ (CM Jagan) అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మహిళల భద్రత విషయంపై చర్చ చేపట్టిన సమయంలో ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం(Telangana CM KCR)కు హాట్సాఫ్ చెప్పారు. హైదరాబాద్ హత్యాచారం దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి (Telangana GOVT)హ్యాట్సాఫ్ అని అన్నారు.

చంద్రబాబు పాలనలో వేల సంఖ్యలో అత్యాచార ఘటనలు, వేధింపులు నమోదయ్యాయని, బాబు సలహాలు ఇవ్వాలని అడిగితే..అలా చేయకుండా విమర్శలు చేస్తారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలమే అయ్యిందని, కానీ తమ హాయాంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు, వేధింపులు తనను బాధించాయని సభలో తెలిపారు. అందుకే మహిళల భద్రతపై ఒక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, ఇందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరడం జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా బాబు హాయాంలో జరిగిన అత్యాచార, వేధింపులు, ఇతరత్రా వాటిపై లెక్కలను చదివి వినిపించారు. మనిషి మద్యం తాగటం వల్ల విచక్షణ కోల్పోయి..హింసలకు పాల్పడే అవకాశముందని అందుకే ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..విడతల వారీగా మద్యాన్ని నియంత్రిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు (Nara Chandra Babu Naidu)

మహిళల భద్రతలో భాగంగా అత్యాచార ఘటనలపై ఓ చట్టాన్ని తీసుకురావాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సందర్భంగా సభలో చర్చ జరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. భద్రతపై కఠినమైన చట్టం తీసుకురావాలని..ఇందుకు టీడీపీ సపోర్టు ఉంటుందని సభలో ప్రకటించారు.

నిర్భయ ఘటన జరిగిన అనంతరం దేశంలోనే కాక..మారుమూల గ్రామాల్లో సైతం ఆందోళనలు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అమ్మాయిలను బయటకు పంపాలంటే..తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు. ఉల్లి ధరల పెరుగుదలలో భాగంగా బాబు ఉల్లి దండలతో అసెంబ్లీకి వచ్చారు. దీనిపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు.

నిర్భయకు నిధులు కేటాయించి..ఓ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన జరగడం అత్యంత దారుణమన్నారు. యూపీలో ఉన్నాన్ సంఘటను సభకు వివరించారు. అందరిలో ఒక ఆందోళన, బాధ, ఆవేశం వ్యక్తమయ్యాయన్నారు. ఒక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వ ముందుకు రావడం అభినందనీయమన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా (YCP MLA Roja)

వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రం మహిళాంధ్రప్రదేశ్ గా మారాలని పేర్కొన్నారు. మహిళను అడవిలో వదిలేసి వస్తే భద్రంగా బయటకు వచ్చే అవకాశముందేమో గానీ.. పొద్దున్న లేచి బయటకు వెళ్తే మాత్రం ఈ సమాజంలో తిరిగి వస్తుందనే నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్ర‌ప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్ గా మారాలి.ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే వారికి వెన్నులో వణుకు పుట్టేలా ఒక చట్టాన్ని తేవాలని ఏపీ సీఎంని కోరారు.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. తన కుటుంబ సభ్యులను దూషించిన వాళ్లను చంపేద్దామని గన్ తీసుకుని వీధుల్లోకి వచ్చిన వ్యక్తి, ఇవాళ అత్యాచారం చేస్తే రెండు బెత్తం దెబ్బలు వేయాలంటున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ సభ్యురాలు రోజా వ్యాఖ్యలకు అడ్డుతగిలారు. సభలో లేని వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. దాంతో రోజా తన విమర్శలను సభలో ఉన్న జనసేన ఎమ్మెల్యే ద్వారా పవన్ కల్యాణ్ కు తెలియజేస్తున్నట్టు సవరణ ప్రకటన చేశారు. మహిళల భద్రతపై చర్చిస్తోంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ పడుతోంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి, గతంలో ఆడవారిపై లోకేశ్, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి చర్చ వస్తుందేమోనని టీడీపీ భయపడుతోందని విమర్శనాస్త్రాలు సంధించారు.

7 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 17వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీకి సెలవు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రారంభమైన సమావేశాలు కేవలం 7 రోజులు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 11, 12, 13, 16, 17 తేదీల్లో సభ సమావేశంకానుంది. మరోవైపు, సభలో దురుసుగా ప్రవర్తిస్తూ వెల్ లోకి సభ్యులు దూసుకురావడంపై కూడా చర్చ జరిగింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (TDP MLA Acchem Naidu)

23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ తన మాట నిలబెట్టుకోవాలన్నారు.

వైసీపీ మంత్రి కన్నబాబు ( Minister Kurasala Kannababu)

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చిపుచ్చుకోవండంపై తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసినంత ఎవరికి తెలియదని కన్నబాబు అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీయే మద్దు అన్న చరిత్ర టీడీపీదేనని అన్నారు.

రాత్రికి రాత్రే చంద్రబాబు యూటర్న్ తీసుకొని ప్యాకేజీ కాదు..ప్రత్యేక హోదా చాంపియన్స్ తామే అని టీడీపీ నేతలు చెప్పుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర దెబ్బతీసి, ప్రత్యేక హోదా రాకపోయినా, ఇవ్వకపోయినా ప్యాకేజీతో సరిపెట్టుకుంటారని ఒక మైండ్ సెట్ ను క్రియేట్ చేసింది చంద్రబాబు అని అన్నారు. టీడీపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అధికారం, విభజన చట్టం హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

ఐదు నెలల పాటు ఏమీ చేయలేక కేవలం ఆరునెలల కాలంలో ఏదో జరిగిపోయింది.. పట్టించుకోలేదని మాట్లాడుతున్నారని అన్నారు. మోడీ అన్యాయం చేశారని విమర్శించి, మళ్లీ ఎన్నికల సమయంలో మోడీతో జతకట్టే ప్రయత్నం చేసి, నలుగురు ఎంపీలను బీజేపీకి వలస పంపించారని తెలిపారు.

వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి (MLA Anam Ramnarayana reddy)

వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ దయచేసి నా సీటు మార్చండి సార్.. సభ్యులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతాను కానీ.. ప్రతిపక్ష నేతే నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను సార్.. ఆయన నా పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం, శక్తి నాకుందా? సార్ అంటూ ప్రశ్నించారు.. వారి ముందు నేను చాలా చిన్నవాణ్ణి.. వారొచ్చి నా పక్కన నిల్చుంటే నేనేం మాట్లాడగలను. దయచేసి అరాచక శక్తులు అనే పదం వారు ఉపసంహరించుకోమని చెప్పండి లేదా మీరైనా (స్పీకర్) రికార్డ్స్‌లో నుంచి తొలగించండి’ అన్నారు.