Amaravathi, december 9: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(AP Assembly winter session) తొలిరోజు వాడి వేడీగా జరుగుతున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ (TDP)నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయింది. సభ ప్రారంభం కాగానే ఉల్లి ధరల(Onion Price)పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.
రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి కీలక చర్చ జరుగుతోందని, ఉల్లి ధరలపై చర్చను తరువాత చర్చిద్దాం అని తెలిపారు. దీంతో టీడీపీ ఉల్లి ధరలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నేతలు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan)సీరియస్ అయ్యారు.
దేశంలో కిలో ఉల్లిని కేవలం రూ. 25కే అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అసెంబ్లీలో ఉల్లి ధరలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లిని రూ. 200కు అమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేక ఉల్లి పంటను పొలాల్లోనే రైతులు వదిలేసేవారని చెప్పారు.
ఇప్పుడు ఉల్లి మంచి ధరకు అమ్ముడుపోతుండటంతో రైతులకు లాభాలు వస్తున్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కల్పించుకుని... ఉల్లి ఎక్కడ దొరుకుతున్నా కొంటూ, సబ్సిడీపై ప్రజలకు తక్కువ ధరకే అందేలా చేస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. రైతుబజార్లో ఉల్లికోసం కోసం క్యూ లైన్లో నిలబడ్డ సాంబయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఉల్లి బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.120కి పైగా పలుకుతుండడంతో ఏపీలో సబ్సిడీలో భాగంగా ఉల్లి కిలో రూ.25 కే ఇస్తున్నారు.దీంతో ఉదయం నుంచి గంటన్నర పాటు లైన్లో నిలబడ్డాడు. ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు చెప్పారు .