AP Cabinet Meeting Highlights: ఈబీసీ మహిళలకు మూడేళ్లకు రూ. 45 వేల ఆర్థిక సాయం, అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం, ఈ ఏడాది నవరత్నాల పథకాలకు మంత్రి వర్గ ఆమోదం, కేబినెట్ భేటీలో ఏపీ సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు (AP Cabinet Meeting Highlights) కేబినెట్ ఆమోదం తెలిపింది.
Amaravati, Feb 23: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు (AP Cabinet Meeting Highlights) కేబినెట్ ఆమోదం తెలిపింది.
అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు మంత్రి పేర్నినాని తెలిపారు. ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) ముగిసిన అనంతరం మీడియాతో నాని మాట్లాడుతూ.. రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి ( EBC Nestam) కేబినెట్ ఆమోదముద్ర వేసిందని పేర్నినాని తెలిపారు. 45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లపాటు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. నవరత్నాల అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
23 రకాల సంక్షేమ పథకాలకు నెలవారీగా షెడ్యూల్ ప్రకటించారు. 5.69 కోట్ల మంది పేదలకు క్యాలెండర్ ప్రకారం పథకాలు అమల చేయనున్నట్టు తెలిపారు. జగనన్న విద్యా దీవెనలో సంపూర్ణంగా బోధనా ఫీజు చెల్లింపులు ఉంటాయన్నారు. నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది.
ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతికి సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎం, ఆర్డీయేకు రూ. 3వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభంకానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌లో అభిప్రాయం పడినట్లు సమాచారం. హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ భేటీ తర్వాత పలువురు మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. కుప్పం కోటను బద్దలు కొట్టారంటూ మంత్రి పెద్దిరెడ్డిని ఈ భేటీలో జగన్ ప్రశంసించినట్లు తెలిసింది. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుదామని జగన్ అన్నట్లు సమాచారం. వ్యాక్సిన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశముందని సీఎం భావిస్తున్నాట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో చరిత్రలో లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని మంత్రుల వద్ద సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు.