Amaravati, Feb 23: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంద్రకీలాద్రిపై (Kanaka Durgamma Temple) అక్రమాల నిధి ఇంటి దొంగల పనే అని ఏసీబీ నివేదిక తేల్చింది. దీంతో చర్యలు చేపట్టిన దేవాదాయశాఖ దుర్గగుడిలో ఐదుగురు సూరింటెండెంట్లతో పాటు 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. గత మూడు రోజుల ఏసీబీ సోదాల్లో వెలుగు చూసిన అవినీతి అక్రమాలపై ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు ఈ మేరకు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.
గుడిలో ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దాడులు చేసి, పలు కీలక పత్రాలను, అవినీతి ఆధారాలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా, భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక వీరు దేవాలయం భూములు, షాపుల లీజు, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం, అన్నదానం, ప్రసాదాల తయారీ వంటి అన్ని చోట్లా అవినీతికి పాల్పడినట్టు తేలడంతో, అందరినీ తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టు (Durga Temple Employees Suspended) దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు, నిన్న రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం 7 విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్‌లు, 8 మంది సిబ్బంది సస్పెండ్ (13 employees suspended) చేయాలని దుర్గగుడి ఈవోను దేవాదాయ కమిషనర్ ఆదేశించారు. సస్పెండ్ అయిన వారిలో సూపరిడెంట్ అమృతరావు, భాగ్యజ్యోతి, చందు శ్రీనివాస్, హారికృష్ణ, శ్రీనివాసమూర్తి, గుమస్తాలు శారీస్ సెక్షన్ మధు, పాతపాడు నాగేశ్వరరావు, పోటో కౌంటర్ రాంబాబు, టిక్కెట్లు కౌంటర్ పి రవి, డోనేషన్ కౌంటర్ కె రమేష్, లడ్డు కౌంటర్లు కొండలు ఉన్నారు.
స్టోర్స్, హౌస్ కీపింగ్, అన్నదానం, షాపుల లీజు, సూపర్ వైజింగ్ విభాగాల సూపరింటెండెంట్‌లు సస్పెండ్ అయ్యారు. అలాగే దర్శన టిక్కెట్లు, ప్రసాదాల విభాగం, చీరలు, ఫోటోల విభాగంలో సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.