CM YS Jagan Polavaram Tour: రేపు పోలవరాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం, గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Amaravati, july 13: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో (CM YS Jagan Polavaram Tour) పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్ కు జగన్ చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్ లో పోలవరంకు (Polavaram project) పయనమవుతారు. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. 1.20 గంటలకు పోలవరం నుంచి తిరుగుపయనమవుతారు.
నేడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష ( chief minister YS Jagan Mohan Reddy) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలన్నారు.
పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీకూడా ఈ ఏడాది పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలని తెలిపారు.
గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. అలాగే అర్బన్ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటు, వాటితోపాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వెట్ వేస్టేజ్ ఉంటే దాన్ని తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక ప్రత్యేక నంబర్‌ను గ్రామాల్లో డిస్‌ప్లే చేయాలని, దానికి కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా సేకరించి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు తరలించాలని అధికారులకు సూచించారు.
అపరిశుభ్రత, దోమలవల్ల రోగాలు వస్తున్నాయని అలాంటి పరిస్థితులను నివారించాలన్నారు. బలోపేతమైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుందని, వైయస్సార్ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని సీఎం జగన్ స్పష్టంచేశారు. లక్షలమంది రైతులకు ఉపయోగపడుతుందని, దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
వైయస్సార్ జలకళ ప్రాజెక్టు సమర్థవంతంగా ముందుకుసాగాలని, రాష్ట్రంలో చిన్నచిన్న నదులపై ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యాం తరహాలో నిర్మాణాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కనీసం 3-4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలని, తద్వారా భూగర్భజలాలు బాగా పెరుగుతాయని సీఎం తెలిపారు. దీనిపై ఒక కార్యాచరణ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేయాలని, వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
పంచాయతీరాజ్, రెవిన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సమగ్రసర్వేను ఉద్దృతంగా చేయడంపై కమిటీ దృష్టిపెట్టనుందని సీఎం జగన్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.