Andhra Pradesh Mining Minister Peddireddy Ramachandra Reddy (File Photo/ANI)

Amaravati, July 13: ఏపీలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ మార్చి 25న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 2ను (GO number 2) హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు నిన్న విచారణ జరిపింది. పంచాయితీ కార్యదర్శుల హక్కుల్ని హరించేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 సవరణకు, ఏపీ పంచాయితీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో ఉందని కోర్టుకు తెలిపారు.

సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. దీనిపై గతంలోనూ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది.

జాగ్రత్త.. ఏపీలో మాస్క్ లేకుంటే రూ.100 జరిమానా కట్టాల్సిందే, మాస్కుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్న ఏపీ ప్రభుత్వం, అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు

సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ల కూడదని కోర్టు (ap high court) అడిగింది. రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్‌ కూడా అలాగేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోషియేషన్‌ గౌరవ ఛైర్మన్‌ బుచ్చిరాజు అన్నారు. డ్రాయింగ్‌, డిస్బర్సింగ్‌ అధికారాలు పంచాయతీ కార్యదర్శులకే ఉండాలన్నారు.

ఏపీలో కరోనా తగ్గినా కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్, ఇప్పటివరకు రాష్ట్రంలో 3876 మ్యూకోర్మైకోసిస్ కేసులు నమోదు, తాజాగా 1,578 మందికి కోవిడ్ పాజిటివ్, 3,041 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్

దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (minister peddireddy ramachandra reddy) స్పందించారు. జీవో నెంబర్ 2లో కొన్ని లోపాలు వున్నాయని అయితే వాటిని సరిదిద్దుకునేలోపే కొంతమంది కోర్టుకు వెళ్లారని మంత్రి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు గ్రామ స్వరాజ్యంలో భాగమని పెద్దిరెడ్డి అన్నారు. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినవి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. లోపాలు సరిదిద్దుకుని తిరిగి జీవోను జారీ చేస్తామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడెలాగూ కోర్టు జీవోను కొట్టివేసింది కాబట్టి, లోపాలను సరిదిద్దుకుని మళ్లీ జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దీనిపై న్యాయ విభాగంతోనూ, సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు