Amaravati, Dec 27: ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం (AP High Court) తోసిపుచ్చింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఫీజులు (Private College, Schools fees )ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 53, 54జీవోలను చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
దీనిపై సోమవారం విచారించిన ఉన్నత న్యాయస్థానం.. మేనేజ్‌మెంట్ నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్ (New GO) ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న 53, 54 జీవోలు ఇచ్చింది. అయితే, వీటిని సవాలు చేస్తూ 'తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్' అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరఫున గతంలో వ్యాజ్యాలు వేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి.
రుసుములను ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని గుర్తుచేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, పి.వీరారెడ్డి గతంలో కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులు సంతృప్తి చెంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తారంటూ వాదనలు వినిపించాయి. అయితే, పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఆ జీవోలను తోసిపుచ్చింది.
జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వు
ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సోమవారం మరోసారి వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. గతంలో ఇదే అంశంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
రఘురామ తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్ సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ వాదించారు. జగన్‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై వైఖరి ఏమిటని సీబీఐని హైకోర్టు ప్రశ్నించగా.. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఏమీ మార్పులేదని స్పష్టంచేసింది. దీంతో రఘురామ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.