CM YS Jagan Covid-19 Review: ఒమిక్రాన్ భయాలు, కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో కొత్తగా 54 పాజిటివ్ కేసులు నమోదు

ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

AP Chief Minister YS Jagan | File Photo

Amaravati, Dec 27: కోవిడ్‌ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష సమావేశం (CM YS Jagan Covid-19 Review) నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

ఈ సమావేశంలో క్రమం తప్పకుండా ఇంటింటా ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణకు ఇది మంచి మార్గం అని పేర్కొన్నారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీవర్‌ సర్వే (ప్రస్తుతం 34వ సర్వే జరుగుతోంది) చేసే సమయంలోనే వ్యాక్సిన్‌ వేయించుకోని వారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని సూచించారు. టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతుల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వైద్యం అందించాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలని, సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలని సూచించారు. వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, తాజా కేసులపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని తెలిపారు. అయితే వీరిలో ఎవ్వరూ కూడా ఆస్పత్రిపాలు కాలేదని చెప్పారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 17,940 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 19 కొత్త కేసులు వెల్లడి కాగా, విశాఖ జిల్లాలో 13 కేసులు గుర్తించారు. అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 121 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఏపీలో ఇప్పటిదాకా 20,76,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,957 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,099 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,490 అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.