Andhra Pradesh: సంక్షేమ పథకాల కోసం మరో రూ.216.34 కోట్లు విడుదల, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామని తెలిపిన సీఎం జగన్
ఈ క్రమంలో ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు.
Tadepalli, August 24: ఏపీ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు.
ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను సీఎం జగన్ అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం.. క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. దీంతోపాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నాం. ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నాం. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడం. కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నాం. పెన్షన్ల సంఖ్య మొత్తం 64లక్షల 27వేలకు చేరుకుందన్నారు.
గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ప్రస్తుతం రూ.2750కి చేరిందన్నారు. జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేసే బాధ్యత నాది. దాన్ని నిలబెట్టుకుంటూ వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
అనంతరం, లబ్ధిదారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటామన్నారు.