Cheddi Gang Members Arrested: ఎట్టకేలకు గుజరాత్ లో చిక్కిన చెడ్డీ గ్యాంగ్ ముఠా, ఇద్దర్ని అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు, మిగిలిన వారి కోసం కొనసాగుతున్న వేట
నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ ఐదు ప్రాంతాల్లో దొంగతనాలకు యత్నించడంతో, శివారు ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ చెడ్డీ గ్యాంగ్ సభ్యుల ఆగడాలకు ఎట్టకేలకు విజయవాడ పోలీసులు (Vijayawada police) అడ్డుకట్ట వేశారు
Amaravati, Dec 15: ఏపీ రాష్ట్రంలో వరుస దొంగతనాలతో ప్రజలను హడలెత్తించిన విషయం విదితమే. నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ ఐదు ప్రాంతాల్లో దొంగతనాలకు యత్నించడంతో, శివారు ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ చెడ్డీ గ్యాంగ్ సభ్యుల ఆగడాలకు ఎట్టకేలకు విజయవాడ పోలీసులు (Vijayawada police) అడ్డుకట్ట వేశారు. గుజరాత్‌లో రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించి, నలుగురు సభ్యులను అదుపులోకి (Cheddi Gang Members Arrested) తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో మిగిలిన సభ్యుల కోసం అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక బృందాలు వేటను సాగిస్తున్నాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) చోరీ చేసిన సమయంలో సీసీ ఫుటేజీలో వీరి చిత్రాలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలను మధ్యప్రదేశ్, గుజరాత్ పోలీసులకు ఇక్కడి పోలీసులు పంపగా.. గుజరాత్ నేర విభాగానికి చెందిన పోలీసులు ఈ చిత్రాలను ధ్రువీకరించి, వారి రాష్ట్రంలో దాహోద్ ప్రాంతంలోని చెడ్డీ గ్యాంగ్‌గా నిర్ధారించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, దాహోద్ ప్రాంత ఎస్పీతో మాట్లాడారు. వారి ఆట కట్టించేందుకు విజయవాడ నుంచి పోలీసు బృందాన్ని గుజరాత్‌కు పంపగా, ఆ బృందం శనివారం సాయంత్రానికి అక్కడికి చేరుకొంది. రెండు గ్యాంగ్‌లలో ఇద్దరు సభ్యులను పట్టుకుంది. మిగిలిన సభ్యులను పట్టుకొని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేసేందుకు వీలుగా.. మరొక పోలీస్ బృందాన్ని గుజరాత్‌కు పంపగా, ఆ బృందం మంగళవారం రాత్రికి అక్కడికి చేరింది.
విజయవాడలోని చిట్టినగర్, పోరంకి, ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి, కుంచనపల్లి ప్రాంతాల్లో జరిగిన ఐదు దొంగతనాల్లో సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, ఇతర సాంకేతికత ఆధారంగా రెండు గ్యాంగ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్యాంగ్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు నిర్ధారించారు. వీరి కదలికలపై నిఘాను పెట్టారు. సీపీ టీకే రాణా స్వయంగా ఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. గుణదల, మధురానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. శివారు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా తమ ప్రాంతాల్లో తిరిగితే 100 కాల్ సెంటర్‌కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని విస్తృత ప్రచారం చేశారు. శివారు ప్రాంతాల్లో ఉండే అపార్ట్‌మెంట్లు, గ్రూపు హౌస్‌ల్లో ఉండే వాచ్‌మెన్‌లకు, సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి, రాత్రి వేళ్లలో జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. అంతేకాక కమిషనరేట్ పరిధిలో 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి శివారు ప్రాంతాల్లో 10 పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీని ముమ్మరం చేశారు. డీసీపీలు హర్షవర్థన్‌రాజు, బాబూరావు, క్రైం బ్రాంచ్ ఏడీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నిరంతరం పర్యవేక్షించారు.