Polavaram Project: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్‌పై డీడీఆర్పీ కీలక సూచన, దెబ్బతిన్న చోట్ల యు ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్
ఈ ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను (Polavaram diaphragm wall) నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ (Dam Design Review Panel ) సూచించింది.
Polavaram, Mar 6: గోదావరి వరదలకు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం (Polavaram Project) ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన సంగతి విదితమే. ఈ ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను (Polavaram diaphragm wall) నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ (Dam Design Review Panel ) సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది.
భారీ వరదలకు దెబ్బతిన్న ఈ నిర్మాణాన్ని ఎలా సరిదిద్దాలనే అంశంపై నిపుణులు ఓ నిర్ణయానికి వచ్చారు. దెబ్బతిన్నంత మేర ఎక్కడికక్కడ చిన్నచిన్నగా ‘యు’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ చిన్న డి.వాల్‌లను ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానించాలని ఆదివారం నిర్వహించిన కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని డీడీఆర్పీ నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.
పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది.
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టుకు మరో డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన అవసరం లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్ వరదలతో దెబ్బతిందని, రెండు వైపులా గుంతలు ఏర్పడ్డాయని, పైభాగం కొట్టుకుపోయిందని చెప్పారు. ఈ గుంతలు పూడ్చేందుకు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. దెబ్బతిన్న వాల్‌కు మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందో లెక్కించాల్సి ఉందని మంత్రి వెల్లడించారు.
ఆదివారం ఆయన నిపుణుల బృందంతో కలిసి ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. గత రెండు వారాలుగా జాతీయ జల విద్యుత్తు పరిశోధన సంస్థ డయాఫ్రం వాల్ సామర్థ్యాన్ని పరీక్షించి నివేదిక ఇచ్చింది. మొత్తం నాలుగు చోట్ల దెబ్బతిన్నట్లు గుర్తించింది. చాలా పెద్ద పగుళ్లు, గుంతలున్నాయి. వీటిని శాస్త్రీయంగా ఇసుకతో వైబ్రోకంపాషన్ చేసేందుకు 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలి. ఇప్పటికే 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సేకరించాం. ఈ ఐదు నెలలు ప్రాజెక్టు నిర్మాణానికి కీలకంగా భావిస్తున్నాం.
వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం కనుక ఈ సీజన్‌లో ప్రాజెక్టు పూర్తికాకపోవచ్చు. టీడీపీ 2018లోనే పూర్తి చేస్తామని బల్లలు గుద్ది ప్రాజెక్టును ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. మా ప్రభుత్వం 2022లోగా పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నా టీడీపీ తప్పిదాలతో ఆలస్యమవుతోంది. ఈ పరిణామాల బాధ్యులపై చర్యల గురించి త్వరలో చెబుతాం.
రూ.1800 కోట్లు ఇవ్వనున్న కేంద్రం
ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల కోసం ఆలోచించకుండా ఇప్పటివరకు రాష్ట్రమే రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం రూ.1800 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. రెండు వారాల కిందట రూ.366 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం గుంతలు పూడ్చేందుకు ఖర్చయ్యే రూ.2 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలని భావిస్తున్నాం. 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులను సాధ్యమైనంత వేగంగా పరిహారం ఇచ్చి పునరావాస కాలనీలకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.