Andhra Pradesh Factory Explosion:రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు
శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.
Vjy, August 23: అచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటన బాధాకరం. ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోం మంత్రి పర్యవేక్షణకు వెళుతున్నాను అన్న మాటే లేదు.
కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించింది. కలెక్టర్ కమిషనర్ ఎప్పుడు వెళ్లారనేది చాలా బాధ కలిగించే విషయం. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారు. అచ్యుతాపురం సెజ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్, బాధితులతో మాట్లాడిన జగన్, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఆరా
ఇలాంటి ఘటనే మా హయాంలో జరిగింది. అదీ కోవిడ్ సమయంలో. ఎల్జీ పాలీమర్స్ ఘటనలో 24 గంటల్లోపే పరిహారం ఇప్పించాం. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. నేనే ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. గంట్లలోనే రూ.30 కోట్లు పరిహారం సొమ్ము పంపించాం. గతంలో ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలా స్పందించలేదు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలి.
పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక రూపాయి ముట్టలేదు. ఇవ్వాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోండి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి స్వయంగా ధర్నా చేస్తాను. బాధితులకు అండగా ఉంటాను.
.చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయాను. ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలి. పరిశ్రమలపై పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్‌పార్టీ కంపెనీలు అడిట్‌లు, సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు. సూపర్ పిక్స్ అమల మీద వీరి దృష్టి లేదు. వీళ్ల ధ్యాస అంతా రెడ్ బుక్ అమలుపైనే. రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవికావు. కార్మికులు చనిపోయేవారు కాదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది