Andhra Pradesh Father Murder Case: మదనపల్లెలో తండ్రిని చంపిన కూతురు కేసులో షాకింగ్ నిజాలు, ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపి, చివరకు..
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇష్టం లేని పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి సోమవారం వెల్లడించారు
MadanaPalle, June 18: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇష్టం లేని పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి సోమవారం వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పీఅండ్‌టీ కాలనీకి చెందిన దొరస్వామి (62) దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బీఎస్సీ, బీఈడీ చదివిన తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలోనే వేశారు. తల్లి నగలను సైతం ఆమెకే అప్పగించారు. అయితే హరిత మదనపల్లెకు చెందిన రమేశ్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సాయి కృష్ణ అనే మరో యువకుడికి రూ.8 లక్షలు ఇచ్చింది. ఈ ఇద్దరే కాకుండా హరీష్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటోంది. దారుణం, ఇష్టం లేని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కూతురు, మదనపల్లిలో విషాదకర ఘటన
ఈ విషయాలు తెలుసుకున్న దొరస్వామి మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు హరిత నిరాకరించింది. ఈ విషయమై నెల రోజులుగా తండ్రి, కుమార్తెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రతో విచక్షణా రహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసింది.
తీవ్రగాయాల పాలైన ఆయన మృతి చెందారని డీఎస్పీ తెలిపారు. హత్య జరిగిన రోజు అరుపులు విని చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా, దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన తండ్రి కాలుజారి కింద పడటంతో గాయాలయ్యాయని హరిత వారికి చెప్పడం గమనార్హం. తరువాత పోలీసులకూ అదే విషయాన్ని తెలిపింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి హరితే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితురాలిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.