PRC Issue in Andhra Pradesh: పీఆర్సీ రగడ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఉద్యోగులు అడగకుండానే అన్నీ చేశామని తెలిపిన సజ్జల, పూర్తిస్థాయి ఆందోళనలకు దిగుతామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక
తాజాగా పీఆర్సీ అంశానికి సంబంధించి మంత్రుల కమిటీతో జరిగిన ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది ఈరోజు(మంగళవారం) సంప్రదింపుల కమిటీ వద్దకు ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ సభ్యులు వచ్చారు.
Amaravati, Jan 25: ఏపీలో పీఆర్సీ అంశం ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచనలు కనపడటం లేదు. తాజాగా పీఆర్సీ అంశానికి సంబంధించి మంత్రుల కమిటీతో జరిగిన ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది ఈరోజు(మంగళవారం) సంప్రదింపుల కమిటీ వద్దకు ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ సభ్యులు వచ్చారు. దీనిలో భాగంగా ప్రభుత్వ నిర్ణయాలు, ప్రయోజనాలను మంత్రుల కమిటీ వివరించింది. జీతాలు తగ్గాయన్న అపోహలను మంత్రుల కమిటీ తొలగించే యత్నం చేసింది.
ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో (Sajjala Ramakrishna Reddy Press Meet ) మాట్లాడుతూ.. ఉద్యోగుల అపోహలు తొలగించే ప్రయత్నం చేశామన్నారు. 27వ తేదీన మరొకసారి చర్చలకు పిలిచాం. ఉద్యోగులు ప్రభుత్వంలో (Andhra Pradesh government) భాగమే. జీవోలను అబియన్స్‌లో పెట్టాలని వారు కోరారు. అవి తర్వాతైనా సవరించుకోవచ్చని చెప్పాం. మేం చెప్పిన విషయాలను వాళ్ల నాయకత్వంతో చర్చించి చెప్తామన్నారు. ఫిట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి మార్పు ఉండదు. ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. వారి అపోహలను (PRC Issue Andhra Pradesh) తొలగించే యత్నం చేసింది. సీఎం జగన్ (CM Jagan) ఎప్పుడూ ఉద్యోగులకు మేలు చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు ఉద్యోగులు అడగకుండానే అన్నీ చేశాం’ అని సజ్జల తెలిపారు.
ఏపీలో కొత్తగా 13,819 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు
ఇదిలా ఉంటే ప్రభుత్వం తాజాగా జీతాలు, పెన్సన్ బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా ఆర్ఠిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్సన్ బిల్లులు ప్రాసెస్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీతాలు, పెన్సన్ బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, డీపీఓలకు మరోసారి సర్క్యులర్ జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఏపీలో పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. నేటి నుంచి పూర్తిస్థాయి ఆందోళనలకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు దిగారు. పలుచోట్ల ఉద్యోగ సంఘాలు ద్విచక్ర వాహన ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రభుత్వం మోసం చేసిందని.. తమకు నష్టం కలిగించే పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడలో పాతబస్టాండ్ నుంచి గాంధీనగర్ ధర్నాచౌక్ వరకు ఉద్యోగ సంఘాలు భారీ ప్రదర్శన చేపట్టాయి. అనంతపురంలో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. మరోవైపు కలెక్టరేట్ల వద్ద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
పీఆర్సీ అమలు ఉత్తర్వులపై హైకోర్టులో కీలక పరిణామాలు
పీఆర్సీ అమలు ఉత్తర్వులను సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టులో (AP High Court) పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాజ్యంపై కాసేపు విచారణ జరిపిన ధర్మాసనం.. రోస్టర్ ప్రకారం అది తమ వద్దకు విచారణకు రాకూడదని, తగిన బెంచ్ వద్దకు వెళ్లాల్సిందని పేర్కొంది. 'పిటిషన్లో అభ్యర్థన చూస్తుంటే ఓవైపు ఉద్యోగి సర్వీసు సంబంధ వ్యవహారంగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రజాప్రయోజనంగా కనిపిస్తోంది. ఏపీ విభజన చట్టంతో ముడిపడి ఉందని భావించిన హైకోర్టు రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాన్ని మా వద్దకు పంపి ఉంటారు. వాస్తవానికి విభజన చట్టం కారణంగా ప్రస్తుత సమస్య తలెత్తలేదు. రోస్టర్ ప్రకారం తగిన బెంచ్ ముందుకు వ్యాజ్యం విచారణకు వెళ్లేందుకు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాల'ని రిజిస్ట్రీని ఆదేశించింది.
అగ్రవర్ణాల మహిళల అకౌంట్లోకి రూ. 15 వేలు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మొత్తం 3,92,674 మంది ఖాతాల్లోకి రూ.589 కోట్లు
జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బీఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ఇచ్చిన పీఆర్సీ అమలు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. 'పీఆర్సీ ఉత్తర్వులతో ఉద్యోగుల జీతాల్లో కోతపడుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్ర కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయలేదు.
ఆ నివేదికను పరిశీలించేందుకు కార్యదర్శులతో కమిటీ వేసింది. ఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పీఆర్సీ నిర్ణయించారో తెలీదు. ఏపీ విభజన చట్టం సెక్షన్ 78(1) ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీని 2018 జూన్ 1 నుంచి వర్తింపజేస్తున్నారు. డీఏను సర్దుబాటు చేస్తున్నామని చెబుతున్నారు. ఉద్యోగులకు అదనంగా జీతాలు చెల్లించి ఉంటే, వాటిని రాబట్టుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని జీవోలో స్పష్టంచేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు' అన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ.. పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పాలంది. 'పీఆర్సీ కమిషన్ సిఫారసు మాత్రమే చేస్తుంది. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. సర్దుబాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అదనంగా చెల్లించి ఉంటే రాబట్టుకోవచ్చు. తక్కువగా చెల్లించి ఉంటే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. జీతం తగ్గితే ఉద్యోగి అభ్యంతరం చెప్పొచ్చు. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేరని పేర్కొంది. 'ఆదాయ, వ్యయాలను చూసుకోవాల్సింది ప్రభుత్వమే. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే యజమానిగా జీతాలను తగ్గించొచ్చు' అని వ్యాఖ్యానించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ 'ఉద్యోగల సంఘాల నేతలతో 9సార్లు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రితో ఓసారి భేటీ అయ్యారు. యూనిట్ ఆధారంగా ఉద్యోగి జీతాల్లో రూ.28 వేలు పెరిగింది. 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.62వేల కోట్లు ఉంది. కొవిడ్ కారణంగా మూడేళ్లుగా ఆదాయం తగ్గింది. 2021కి ఆదాయం రూ.75వేల కోట్లకు చేరాల్సింది, రూ.60 వేల కోట్లకే పరిమితమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే రూ.67వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర నిధుల్లోంచి లేదా అప్పులు చేసి అమలు చేయాల్సి వస్తోంది.
ప్రస్తుత పీఆర్సీతో రూ.10,865 కోట్ల భారం పడుతుంది. ఈనెల పే స్లిప్పులు సిద్ధం చేస్తేనే కదా.. పీఆర్సీ అనుకూలంగా ఉందో, లేదో తెలిసేది. ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్తామని బెదిరిస్తున్నాయి. 12 మంది ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. వారేమో మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇస్తామంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చట్టవిరుద్ధమని సుప్రీం చెప్పింది' అని వాదించారు.
ధర్మాసనం స్పందిస్తూ.. మధ్యాహ్నం 2.15కు జరిగే వీడియో కాన్ఫరెన్స్ విచారణకు 12 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు, పిటిషనర్ హాజరయ్యేలా చూడాలని సూచించింది. భోజన విరామం తర్వాత 2.15కు ప్రారంభమైన విచారణలో ఉద్యోగ సంఘాల నేతలపై ప్రశ్నించగా, వారు రాలేదని తెలపడంతో 'తక్కువ సమయంలో హాజరుకాలేకపోయి ఉంటార'ని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యం తమ వద్దకు రావడంపై హైకోర్టు రిజిస్ట్రీని స్పష్టత కోరామని తెలిపింది. రోస్టర్ ప్రకారం తాము విచారించడం సరికాదని పేర్కొంటూ ఫైల్‌ను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.