Andhra Pradesh: పలాసలో తీవ్ర ఉద్రిక్తత, నారా లోకేష్‌ని అడ్డుకున్న పోలీసులు, మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్, అక్రమ నిర్మాణాల కూల్చివేతను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపిన అధికారులు
పలాసలో కొద్ది రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు ( High Tension in palasa) నెలకొన్న సంగతి విదితమే. పలాసకు బయలుదేరిన టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
Palasa, August 21: శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెన్సన్ నెలకొంది. పలాసలో కొద్ది రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు ( High Tension in palasa) నెలకొన్న సంగతి విదితమే. పలాసకు బయలుదేరిన టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలాసలో కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించేందుకు బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శ్రీకాకుళం కొత్తరోడ్డు వద్ద పోలీసులు (Police detain Nara Lokesh In Srikakulam ) అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారిపై పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నారా లోకేష్ రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతలు చిన్నరాజప్ప, కళా వెంకట్రావులు కూడా రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి తరలించారు. మరోవైపు పలాసకు బయలుదేరిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, చౌదరి బాబ్జిలను పలాస మండలం బెండి గేటు వద్ద అడ్డుకున్నారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపును టీడీపీ అడ్డుకుందనే వార్తల నేపథ్యంలో టీడీపీ వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం ముట్టడికి వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. కాగా, వైఎస్సార్‌సీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు సహా పార్టీ శ్రేణులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పలాస ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వైఎస్సార్‌సీసీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Here's Videos
కాగా శ్రీనివాసనగర్‌లో టీడీపీ కౌన్సిలర్ జి సూర్యనారాయణతో పాటు 51 మందిని ఇళ్లను కూల్చివేసేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. అవన్నీ అక్రమ నిర్మాణాలు అని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు ఇళ్లను కూల్చేందుకు యత్నించగా.. ఇళ్లను కూల్చవద్దని ఓ వృద్ధురాలు పలాస తహశీల్దార్ మధుసూధన్‌రావు కాళ్లపై పడింది. అక్కడికి టీడీపీ, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Here,s Updates
ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను అరెస్ట్ చేసి మందస పోలీస్ స్టేషన్‌కు పంపించారు. పలాస పట్టణంలోకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడును కూడా రానివ్వలేదు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, తమ ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో కుమారి అనే మహిళ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక, శనివారం టీడీపీ ఎంపీ కె రామ్మోహన్‌నాయుడు శ్రీనివాసనగర్‌లో పర్యటించి పరిస్థితిని అడిగి తెలుసుకుని ఇంటి యజమానులకు సంఘీభావం తెలిపారు. మంత్రి అప్పలరాజు ప్రతిపక్ష నాయకులు, వారి అనుచరులపై అనైతిక పోరాటానికి దిగుతున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. పలాసలో జరుగుతున్న భూ కబ్జాలపై ప్రశ్నిస్తుంటే మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులను అడ్డం పెట్టుకుని జేసీబీలతో భయాందోళనకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే టీడీపీ కౌన్సిలర్ సూర్యనారాయణతో పాటు ఆయన అనుచరులైన మరో 51 మంది ఇరిగేషన్ ట్యాంక్‌ను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. నిబంధనల ప్రకారం అధికారులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతల భూకబ్జా చర్యలను వ్యతిరేకిస్తూ ఆదివారం పలాస పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నేడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వ జూనియర్ కలాశాల వరకు ర్యాలీ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాలని చూస్తున్నారు.
మంత్రి అప్పలరాజును టీడీపీ నాయకురాలు గౌతు శిరీష ఏకవచనంతో సంబోధిస్తున్నారని.. ఆ వ్యాఖ్యలపై శిరీష క్షమాపణలు చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. వైసీపీ, టీడీపీ సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలాసలో భారీగా పోలీసులు మోహరించారు. పలాస - కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. . ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆదివారం సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ జీఆర్ రాధిక హెచ్చరించారు.