IPL Auction 2025 Live

PM Modi Speech in Visakha: భారత్‌కు విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరం,ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు, విశాఖలో ప్రధాని మోదీ ప్రసంగం హైలెట్స్ ఇవే..

సుమారు రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

PM Modi (Photo-Video Grab)

Vizag, Nov 12: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. సుమారు రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని సభలో మాట్లాడుతూ (PM Modi in Speech Visakha).. ప్రియమైన సోదరీ సోదరమణులకు స్వాగతం అంటూ తెలుగులో మాట్లాడారు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నానని... ఇప్పుడు మరోసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగిందని ప్రధాని మోదీ అన్నారు.

భారత్ కు విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరమని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనదని... వెయ్యేళ్ల క్రితమే ఇక్కడి నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేదని అన్నారు. ఈరోజు కూడా విశాఖ ప్రముఖ వ్యాపార కేంద్రమని చెప్పారు. తాను ఈరోజు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో విశాఖతో పాటు, ఏపీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మరో అజెండా లేదు,ఉండదు..ఉండబోదు విశాఖలో సీఎం జగన్, ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి

ఏపీ ప్రజలు మంచి వారని, స్నేహ స్వభావం కలిగిన వారని ప్రధాని కొనియాడారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎప్పుడు తనను కలిసినా ఏపీ శ్రేయస్సు, ప్రయోజనాల గురించే మాట్లాడేవారని చెప్పారు. ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని కితాబునిచ్చారు. ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారని చెప్పారు. తెలుగు భాష ఉన్నతమయినదని కొనియాడారు.

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని మోదీ తెలిపారు. విశాఖలో చేపల రేవును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. మన దేశంలో రవాణా వ్యవస్థలో పలు మార్పులు వచ్చాయని తెలిపారు. భారత్ అనేక సవాళ్లను అధిగమించిందని... ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రశంసలు పొందుతోందని, భారత్ కు పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. జీఎస్టీ, గతి శక్తి వంటి వాటి వల్ల పేదల సంక్షేమం మరింత మెరుగుపడుతోందని అన్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు వేస్తున్నామని చెప్పారు. పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇస్తున్నామని తెలిపారు.

రైల్వే స్టేషన్లు, పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. ఈరోజు ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోందని... సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం భారత్ వైపు (India has become focal point of world’s ) చూస్తోందని అన్నారు ప్రజల కోసం డ్రోన్ల నుంచి గేమింగ్ వరకు... అంతరిక్షం నుంచి స్టార్టప్ ల వరకు అనేక పథకాలు పని చేస్తున్నాయని చెప్పారు. అంతరిక్షం నుంచి సముద్రగర్భం వరకు ప్రతి అవకాశాన్ని పట్టుకుంటామని అన్నారు. 'భారత్ మాతాకీ జై' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుల వివరాలు..

► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు

► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే

► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం

► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు

► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన

► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం

► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం